వ్యాక్సినేషన్: టీకా కోసం ఇకపై ‘కోవిన్’ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు…. కేంద్రం కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jun 15, 2021, 10:06 PM IST
Highlights

కోవిడ్ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేసేందుకు గాను కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకునేందుగాను ఇప్పటి వరకు అమల్లో వున్న కోవిన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని వెల్లడించింది. 

కోవిడ్ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేసేందుకు గాను కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకునేందుగాను ఇప్పటి వరకు అమల్లో వున్న కోవిన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 18 ఏళ్లు దాటిన ఏ వ్యక్తి అయినా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అక్కడే ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పటికప్పుడు టీకా తీసుకోవచ్చునని పేర్కొంది.

కోవిన్ ప్లాట్ ఫామ్ అన్నది కేవలం రిజిస్ట్రేషన్లలోని పలు మోడ్ లలో ఒకటి మాత్రమేనని వివరించింది. హెల్త్ కేర్ వర్కర్లు లేదా ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో గానీ–అర్బన్ స్లమ్స్ లో గానీ ప్రజలను ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ల వైపు మొగ్గేలా చూడవచ్చునని..ఇలా వ్యాక్సినేషన్ కవరేజీని పెంచవచ్చునని ఈ శాఖ స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 13 వరకు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ల ద్వారా 23.36 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా..వీరిలో 16.45 కోట్ల మంది ఆన్-సైట్ మోడ్ ని ఎంచుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

Also Read:ప్రైవేట్‌లో కొవాగ్జిన్ ధరలను తగ్గించలేం: తేల్చి చెప్పిన భారత్ బయోటెక్

టీకా కోసం ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు వ్యాక్సిన్‌పై భయం, అనుమానాలతో చాలా మంది టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని కేంద్రం చెబుతోంది.

మరోవైపు ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటివరకు 25.9 కోట్ల వ్యాక్సిన్ ని ప్రజలకు ఇచ్చారు. జూన్ 21 నుంచి దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా కేంద్రం చేపడుతోంది. ఈ కార్యక్రమానికి మరింత ఊతమిచ్చేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంది. టీకాల కోసం రాష్ట్రాలు పైసా కూడా ఖర్చుపెట్టనక్కర్లేదని ప్రధాని మోడీ వెల్లడించారు. 

click me!