దూకుడు పెంచిన చంద్రబాబు: యూపిఎనా, కొత్త పేరా?

By pratap reddyFirst Published Dec 9, 2018, 8:02 PM IST
Highlights

రేపు సాయంత్రం 3.30 గంటలకు ఢిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఉదయం టీడీపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది.

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. రేపు సోమవారం ఎన్డీయేతర పక్షాల సమావేశం జరగనుంది. 

రేపు సాయంత్రం 3.30 గంటలకు ఢిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఉదయం టీడీపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఎన్డీయేతర సమావేశంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు చెప్పారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. 

జాతీయ స్థాయిలో ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయి కూటమి పేరును రేపటి సమావేశంలో నిర్ణయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా కూటమియా, కొత్త పేరా అనేది రేపటి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. 

ఆయన కాంగ్రెసు నేతృత్వంలో ఇప్పటికే యుపిఎ ఉంది. యుపిఎ విడిగా కొనసాగుతూ ప్రాంతీయ పార్టీలు మరో కూటమిని ఏర్పాటు చేసుకుని కాంగ్రెసుతో కలిసి పనిచేస్తాయా, మొత్తంగా కాంగ్రెసునూ యుపిఎ భాగస్వామ్య పక్షాలనూ కలుపుకుని జాతీయ కూటమికి కొత్త పేరు పెడుతారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో ప్రజా కూటమి ఏర్పడిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఆ పేరుతో ముందుకు సాగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది. 

click me!