
యూపీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉమేష్ పాల్ పై మొదట కాల్పులు జరిపిన అతిక్ అహ్మద్ గ్యాంగ్ షూటర్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి. అతడికి పోలీసులకు మధ్య ఆదివారం సాయంత్రం కౌండియారా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది.
ఈ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడిన నిందితుడు విజయ్ కుమార్ ను ప్రయాగ్రాజ్ సివిల్ లైన్స్ లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం వైద్యులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులకు యూపీ పోలీసులు రూ.2.5 లక్షల రివార్డు ప్రకటించిన మరుసటి రోజే ఈ ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం.
ఏవరీ ఉమేష్ పాల్.. ?
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ అలియాస్ విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అలహాబాద్ (వెస్ట్) అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ పై రాజు పాల్ విజయం సాధించిన కొన్ని నెలలకే ఆయన హత్యకు గురయ్యారు. అయితే ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను వారం రోజుల కిందట ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని అతడి నివాసంలో పలువురు దుండగులు హత్య చేశారు.
రాజు పాల్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం నిందితులంతా జైల్లో ఉన్నారు. కాగా.. ఉమేష్ పాల్ ఆయన పోలీసు సెక్యూరిటీ గార్డు సందీప్ నిషాద్ లను ప్రయాగ్ రాజ్ లోని ధూమన్ గంజ్ ప్రాంతంలోని ఆయన ఇంటి బయట శుక్రవారం కాల్చి చంపారు. వీరు ఎస్ యూవీ నుంచి దిగుతుండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.
అయితే ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అర్బాజ్ గత సోమవారం పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ లో ధూమన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రాజేష్ మౌర్య కూడా గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ లోని నెహ్రూ పార్కులో జిల్లా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఈ ఎన్ కౌంటర్ చేసింది.
ఉమేష్ పాల్ ను చంపిన షూటర్లు దాడి తర్వాత రెండు గంటల పాటు ప్రయాగ్ రాజ్ లో దాక్కుని రెండు ఎస్ యూవీల్లో పారిపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘ఇండియా టుడే’ నివేదించింది. బ్యాకప్ ప్లాన్ లో భాగంగా ముందుగానే వాహనాలను సమకూర్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతిక్ అహ్మద్ గత బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు యూపీ పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. బూటకపు ఎన్ కౌంటర్ లో పోలీసులు తనను హతమార్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ సెంట్రల్ జైలులో ఉన్న అహ్మద్.. పోలీసు కస్టడీ లేదా విచారణ సమయంలో తనకు ఎలాంటి శారీరక గాయాలు లేదా హాని జరగకుండా ఉండేలా ఆదేశించాలని కోరాడు.