ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లాట్ కు ఈడీ నోటీసులు పంపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లాట్ ను ఈడీ అధికారులు శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన కొన్ని రోజులకు కైలాస్ గెహ్లాట్ కు కూడ ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం చర్చకు దారి తీసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 21న డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వాంగ్మూలం ఇవ్వాలని కైలాస్ గెహ్లాట్ ను ఈడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారని సమాచారం.2021-22 లో ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ సర్కార్ రూపొందించింది. అయితే ఈ పాలసీపై ఆరోపణలు వచ్చాయి. దరిమిలా ఈ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో 185 శాతం రిటైల్ వ్యాపారులకు 12 శాతం హోల్ సేల్ వ్యాపారులకు లాభం చేకూర్చిందని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు.