ఏదయినా ఎన్నికలు వచ్చాయంటే ముందుగా మనకు వినిపించే పదం ఎలక్షన్ కోడ్ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్). అసలు ఈ ఎలక్షన్ కోడ్ కథేంటి... ఇది ఎలా మొదలయ్యింది... కోడ్ అమల్లోకి వస్తే పాటించాల్సిన నిబంధనలేమిటో తెలుసుకుందాం...
Model code of Conduct (ఎన్నికల ప్రవర్తనా నియమావళి)... ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమీషన్ ఉపయోగించే ఓ బ్రహ్మాస్త్రం. ఈ కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలు ప్రభుత్వ యంత్రాంగం, పాలకపక్షం, ప్రతిపక్షం... ఎంతటివారైనా ఎలక్షన్ కమీషన్ చెప్పింది వినాల్సిందే. సర్వ అధికారాలు అటోమెటిక్ గా ఎన్నికల కమీషన్ చేతిలోకి వెళ్లిపోతాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమే ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి.
ఓటు అనేది దేశ భవిష్యత్ ను నిర్ణయించే ప్రజాస్వామిక ఆయుధం. ఇది తమకు ఎదురులేదకున్న ప్రభుత్వాలను కూల్చగలదు... సామాన్యులను సైతం అందలం ఎక్కించగలదు. అయితే ఈ ఓటు పవర్ తెలియనివారు డబ్బులు, మధ్యం, బహుమతులకు ఆశపడి ఓటుహక్కును అమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు నాయకులు ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇది గమనించిన భారత ఎన్నికల సంఘం మొదటిసారిగా 1960లో ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించి కేరళలో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత 1962 నుండి దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనూ అమలుచేస్తూ వస్తోంది.
undefined
ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీలు, నాయకులు ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయించునే అవకాశం వుంటుంది. అంతేకాదు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టవచ్చు. దీంతో ప్రతిపక్షంలో వున్నవారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలుంటాయి. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని గుర్తించిన ఈసి ఎన్నికల సమయంలో ప్రభుత్వ కార్యకలాపాలపై ఆంక్షలు విధించేలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూపొందించింది.
ఎలక్షన్ కోడ్ సమయంలో రాజకీయ పార్టీలు, నాయకులు పాటించాల్సిన నియమ నిబంధనలివే...
ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే మొదట ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, స్థలాలలో రాజకీయ పార్టీలు, నాయకుల కటౌట్లు, హోర్డింగ్, వాల్ పోస్టర్లను తొలగిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు, అధికారిక వైబ్ సైట్లు ఏ పార్టీకో, నాయకుడికో ప్రచారం కల్పించేలా వుండకుండా చూడాలి.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పరిపాలనాపరమైన విషయాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించాలి... ఎన్నికల ప్రచారం, ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు ఉపయోగించకూడదు. అలా ఎవరైనా అధికారి వ్యవహరిస్తున్నట్లు ఈసి దృష్టికి వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటుంది. పాలకులపైనా చర్యలు తీసుకునే అధికారం ఈసికి వుంటుంది.
ప్రజలను ప్రభావితం చేసేలా సంక్షేమ పథకాలను ప్రకటించడం, అభివృద్ది పనులు చేపట్టడం వంటివి ప్రభుత్వం చేయకూడదు. కొత్తగా ఉద్యోగ ప్రకటనలు కూడా చేయకూడదు. కొన్నిసార్లు ముందునుండే అమలవుతున్న పథకాలను కూడా నిలిపివేయాలని కూడా ఈసి ఆదేశించవచ్చు.
ప్రభుత్వం సొంత ఖర్చులతో సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల గురించి మీడియాకు ప్రకటనలు ఇవ్వడం ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో నిషేదం. రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవచ్చు గానీ ప్రభుత్వం ఆ పని చేయకూడదు. ఎన్నికల సమయంలో అధికారిక కార్యక్రమాలను నిర్వహించవచ్చు... కానీ అది ఎన్నికల ప్రచారం కాకూడదు. ప్రభుత్వ వాహనాలను ప్రచారం కోసం ఉపయోగించకూడదు.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి తేడాలేకుండా ప్రచార అవకాశాలు కల్పించబడతాయి. అయితే బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు ఇలా ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత అధికారులు లేదంటే ఈసీ అనుమతి తీసుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఉద్రిక్తతలు చెలరేగేలా ప్రచార కార్యక్రమాలు వుంటే వాటికి అనుమతి వుండదు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలు, మతపరమైన ప్రార్థనా స్థలాలను ప్రచారానికి ఉపయోగించకూడదు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలన్నింటిని నిలిపివేయాలి. అలాగే పోలింగ్ రోజున ఎలాంటి సభలు, ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి వుండదు.
సామాన్య ప్రజలు జాగ్రత్త :
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందంటే సామాన్య ప్రజలకు కూడా జాగ్రత్తగా వుండాలి. ఎన్నికల్లో డబ్బు, మధ్యం ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఎవరినైనా, ఏ వాహనాన్ని అయినా తనిఖీచేసే అధికారం పోలీసులు, భద్రతా బలగాలకు వుంటుంది. కాబట్టి ఎక్కువమొత్తంలో (రూ.50 వేలకంటే ఎక్కువగా) నగదు, బంగారం, ఇతరత్రా బహుమతులు తీసుకుని ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అలా తరలిస్తుంటే సరైన పత్రాలను కూడా వెంటతీసుకువెళ్లాలి. అలాకాదని ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడితే డబ్బులయినా, బంగారమయినా సీజ్ చేయవచ్చు.
ముఖ్యంగా రాష్ట్రాల బార్డర్లలో ఎన్నికల సమయంలో స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటుచేస్తారు. మద్యం, డబ్బుల అక్రమ రవాణాను జరక్కుండా ఈ చెక్ పోస్టుల ద్వారా నిఘా వుంచుతారు. నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతుంటారు. ప్రైవేట్ వాహనాలనే కాదు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో కూడా తనికీలు చేస్తుంటారు. కాబట్టి ఎన్నికల వేళ అత్యవసరం అయితేగానీ డబ్బులు తీసుకుని ప్రయాణించకూడదు.