
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో.. అమూల్ సంస్థ నుంచి ఒక ట్వీట్ కర్ణాటకలో రాజకీయ తుఫాను సృష్టించింది. అసలు అమూల్ సంస్థ ఏమని ట్వీట్ చేసింది.. ఆ ట్వీట్‌పై రాజకీయ దుమారం ఎందుకు చెలరేగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపార విస్తరణలో భాగంగా గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ తమ పాల ఉత్పత్తులను బెంగళూరులో విక్రయించనున్నట్టుగా ప్రకటించింది.
అయితే ఇది స్థానికంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఆధ్వర్యంలోని నందిని డైరీ బ్రాండ్‌ను కలవరపెట్టింది. నందిని డైరీ బ్రాండ్‌ను అమూల్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో.. జేడీఎస్, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలోని అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఇది బీజేపీ చెడు ప్రణాళికలు, కుట్రల అని ఆరోపిస్తున్నారు. పలు కన్నడ సంస్థలు బీజేపీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటక మార్కెట్‌లోకి అమూల్‌ను అనుమతించాలా వద్దా అనే అంశంపై రాష్ట్రంలో రిఫరెండం నిర్వహించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షాను విపక్ష నేతలు కోరుతున్నారు.
కర్ణాటక మార్కెట్‌లోకి అమూల్ తన ప్రవేశాన్ని ప్రకటించినప్పటి నుంచి.. ట్విట్టర్‌లో #GoBackAmul, #SaveNandini వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కర్ణాటకలోని హోటల్స్ యజమానుల సంఘం కూడా రాష్ట్రంలోని పాడి రైతులకు మద్దతుగా నందిని పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది.
దేశంలోని రైతుల సంక్షేమం కోసం నిర్మించిన కేఎంఎఫ్‌ను కన్నడిగులందరూ కాపాడుకోవాలని.. అమూల్ ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని కన్నడిగులందరూ ప్రతిజ్ఞ చేయాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. “హిందీని విధించడం ద్వారా భాషా ద్రోహంతో పాటు.. రాష్ట్ర సరిహద్దుల్లోకి చొరబడి భూ ద్రోహం, ఇప్పుడు దేశంలోని లక్షలాది పాడి రైతు కుటుంబాలకు జీవనాధారమైన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)ని మూసివేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయబోతోంది’’ అని ఆరోపించారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని కూడా కోరారు.
విలీన ప్రయత్నాలు స్పష్టంగా సఫలం కాకపోవడంతో గుజరాత్‌కు చెందిన ప్రధాని, హోం మంత్రి ఇద్దరూ అమూల్‌ను బ్యాక్ డోర్ ద్వారా రాష్ట్రంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అమూల్ కంటే నందిని మెరుగైన బ్రాండ్ కాబట్టి.. బయటి బ్రాండ్ అవసరం లేదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ‘‘మేము మా పాలను, మా రైతులను రక్షించాలనుకుంటున్నాము. మాకు ఇప్పటికే అమూల్ కంటే మెరుగైన బ్రాండ్ నందిని ఉంది ... మాకు ఏ అమూల్ అవసరం లేదు ... మా నీరు, మా పాలు, మా నేల బలంగా ఉన్నాయి’’ అని శివకుమార్ అన్నారు.
జేడీఎస్ పార్టీ కూడా అమూల్‌పై విమర్శలు గుప్పించింది. ‘‘ఈ పరిణామం మన దేశం గర్వించదగ్గ సంస్థ కేఎంఎఫ్ నందినిని దశలవారీగా నిర్మూలించే దుష్ట ప్రణాళికలో భాగంగా కనిపిస్తోంది. ప్రత్యక్ష విలీనం సాధ్యం కానప్పుడు, ఈ రకమైన మాయలు తెరపైకి వస్తాయి. ఇదీ పోటీ అని చెప్పుకుంటూ కూర్చుంటే దిగ్గజం సంస్థ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’అని పేర్కొంది. ‘‘ఒక దేశం, ఒక అమూల్, ఒక పాలు, ఒకే గుజరాత్’’ అనేది కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానంగా మారిందని జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శించారు. అందుకే, అమూల్‌కి మద్దతుగా నిలబడి కేఎంఎఫ్ గొంతు నొక్కుతోందని ఆరోపించారు.
అయితే ఈ పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. అమూల్‌పై రాజకీయాలు చేయవద్దని, నందిని దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్ అవుతుందని శనివారం అన్నారు. నందిని ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారని.. పోటీ మార్కెట్‌లో అమూల్‌ను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇక, ఇటీవలపెరుగు ప్యాకెట్ల మీద పేరును 'దహీ' అంటూ రాయాలని.. నందిని ఉత్పత్తులపై హిందీని రుద్దారని ఆరోపిస్తూ విపక్ష నేతలు, కన్నడ అనుకూల సంఘాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)ని దూషించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాల సమాఖ్యలు curd పదం తర్వాత బ్రాకెట్లలో స్థానిక నామకరణం పదాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.