మైక్ వదలి రాని హర్యానా హోంమంత్రి.. వేదికపైనే అమిత్ షా సీరియస్, నాలుగు సార్లు చెప్పినా

By Siva KodatiFirst Published Oct 28, 2022, 3:11 PM IST
Highlights

హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ హర్యానాలోని సూరజ్ కుండ్‌లో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్‌‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎప్పుడూ శాంతంగా, ముఖంపై చిరునవ్వుతో కనిపించే కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫైర్ అయ్యారు. అది కూడా ఓ రాష్ట్ర హోంమంత్రిపై. వివరాల్లోకి వెళితే...అంతర్గత భద్రతపై కేంద్ర హోంశాఖ హర్యానాలోని సూరజ్ కుండ్‌లో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్‌‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనిల్‌కు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించగా... ఆయన మాత్రం ఎనిమిదన్నర నిమిషాలు ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో అమిత్ షా పలుమార్లు అనిల్‌కు అంతరాయం కలిగించారు. ఇక్కడ సమయాన్ని గుర్తుచేసేందుకే ఆయన ఇలా చేశారు. 

కార్యక్రమంలో అనిల్ విజ్ స్వాగత ఉపన్యాసం చేశారు. హర్యానా రాష్ట్ర చరిత్ర, హరిత విప్లవం, ఒలింపిక్స్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల ప్రతిభ , రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి చెబుతూ వెళ్లిపోయారు. అనిల్ విజ్‌కు కాస్త దూరంలో కూర్చొన్న అమిత్ షా.. ప్రసంగాన్ని త్వరగా ముగించాలని ఆయనకు ఓ నోట్ పంపారు. అయినప్పటికీ విజ్ పట్టించుకోలేదు. తర్వాత మైక్ ఆన్ చేసి సైగ చేసినా వెనక్కి రాలేదు. చివరికి అమిత్ షా సీరియస్ అయ్యారు. అనిల్ జీ మీకు ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారని, ఇప్పటికే ఎనిమిదిన్నర నిమిషాలు మాట్లాడారని, దయచేసి ఇక ముగించాలని అమిత్ షా సున్నితంగా మందలించారు. 

అయినప్పటికీ మరో పాయింట్ చెప్పాలని కాస్త సమయం అడగ్గా మళ్లీ తమ ప్రభుత్వ విజయాలను చెబుతూ పోయారు. మళ్లీ కలగజేసుకున్న అమిత్ షా.. దయచేసి ముగించాలని మరోసారి కోరారు. అయినా ఆగకుండా ముగింపు వ్యాఖ్యలు చెప్పడంతో అమిత్ షా ఈసారి కాస్త సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామం నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన ప్రసంగాన్ని కేవలం మూడు నిమిషాల్లోనే ముగించడం కొసమెరుపు.

ALso REad:2024 నాటికి అన్ని రాష్ట్రాల్లోకి ఎన్ఐఏ విస్తరిస్తుంది - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో శాఖలను ప్రారంభిస్తుందని, దీంతో పాటు ప్రాంతేతర హక్కులను కూడా పొందుతుందన్నారు. తమ మంత్రిత్వ శాఖ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లను సవరించే ప్రక్రియలో ఉందని చెప్పారు. ముసాయిదాలను త్వరలో పార్లమెంట్‌లో ఉంచనున్నామని పేర్కొన్నారు. ఎన్ఐఏ అధికారాల విస్తరణలో ఉగ్రవాది ఆస్తులను జప్తు చేసే అధికారాలను కూడా ఇవ్వడం ఇమిడి ఉందని అమిత్ షా చెప్పారు.

“ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో నిర్ణయాత్మక విజయం సాధించడానికి, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేయబడుతోంది. దీని కింద ఎన్ఐఏ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను సవరించడం ద్వారా వ్యక్తిగత ఉగ్రవాదులుగా ప్రకటించడానికి నిబంధనలు తయారయ్యాయి. ఎన్ఐఏకు అదనపు ప్రాదేశిక అధికార పరిధితో పాటు ఉగ్రవాదులు సంపాదించిన ఆస్తిని జప్తు చేసే అధికారం కూడా ఇవ్వబడింది. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఏజెన్సీ శాఖలను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాము” అని అమిత్ షా తెలిపారు.
 

click me!