కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు.. నిరాధారమైన ఆరోపణలతో భయాందోళనలు సృష్టిస్తున్నాడు: అమిత్ మాల్వియా ఫైర్

Published : Jul 11, 2023, 04:02 PM IST
కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు.. నిరాధారమైన ఆరోపణలతో భయాందోళనలు సృష్టిస్తున్నాడు: అమిత్ మాల్వియా ఫైర్

సారాంశం

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ  పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేప నేత అమిత్ మాల్వియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌ ఓ అబద్దాల కోరు అని విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ  పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేప నేత అమిత్ మాల్వియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీఎస్‌టీ నెట్‌వర్క్‌తో సమాచారాన్ని పంచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కేజ్రీవాల్ విమర్శలు చేయడంపై అమిత్ మాల్వియా స్పందించారు. కేజ్రీవాల్‌ ఓ అబద్దాల కోరు అని విమర్శలు గుప్పించారు. 40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్‌కు అమిత్ మాల్వియా కౌంటర్ ఇచ్చారు. తొలుత కేజ్రీవాల్ ట్విట్టర్‌లో.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని కూడా ఈడీలో చేర్చిందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం అని ఆరోపించారు. 

‘‘పెద్ద సంఖ్యలో వ్యాపారులు జీఎస్‌టీని చెల్లించరు. కొందరు బలవంతంగా, కొందరు ఉద్దేశపూర్వకంగా. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని కూడా ఈడీలో చేర్చింది. అంటే ఇప్పుడు ఒక వ్యాపారవేత్త జీఎస్టీని చెల్లించకపోతే.. ఈడీ నేరుగా అతన్ని అరెస్టు చేస్తుంది. బెయిల్ ఇవ్వదు. జీఎస్టీ విధానం ఎంత క్లిష్టంగా ఉందో.. పూర్తి జీఎస్టీ చెల్లిస్తున్న వారిని కూడా ఏదో ఒక నిబంధనలో పట్టుకుని జైలులో పెట్టవచ్చు. అంటే దేశంలోని ఏ వ్యాపారినైనా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు జైలుకు పంపుతుంది. ఇది చాలా ప్రమాదకరం. వ్యాపారం చేయడానికి బదులుగా.. వ్యాపారవేత్త ఈడీ నుంచి తనను తాను రక్షించుకుంటాడు. దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు కూడా దీని అధీనంలోకి వస్తారు. వ్యాపారి ఎవరూ మిగలరు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరం. నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. అందరూ వ్యతిరేకంగా మాట్లాడతారని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలి’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

 


అయితే కేజ్రీవాల్ ట్వీట్‌కు కౌంటర్‌గా అమిత్ మాల్వియా.. ‘‘కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వ్యాపార వర్గాల్లో భయాందోళనలు రేపుతున్న వరుస అబద్ధాల కోరు కేజ్రీవాల్. అతను జీఎస్టీ వ్యవస్థలో గందరగోళం, అపనమ్మకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది భారతదేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేసిన, హేతుబద్ధీకరించిన ఒక మైలురాయి సంస్కరణ.

ప్రభుత్వం జీఎస్టీఎన్‌ని పీఎంఎల్‌ఏ కింద చేర్చింది. పన్ను నేరస్థులను పట్టుకోవడం, వారి బకాయిలు చెల్లించేలా చేయడం కోసం జీఎస్టీ నెట్‌వర్క్(జీఎస్టీటీఎన్) ఈడీతో సమాచారాన్ని పంచుకోగలదు. ఇది మనీలాండరింగ్ ద్వారా ఎగవేసిన జీఎస్టీని రికవరీ చేయడంలో సహాయపడుతుంది. జీఎస్టీటీఎన్ అనేది జీఎస్టీ అమలు కోసం ఐటీ సేవలను అందించే లాభాపేక్ష లేని సంస్థ. జీఎస్టీటీఎన్ అనేది పన్ను అధికారం లేదా అమలు చేసే సంస్థ కాదు. ఇది పన్ను ఎగవేత, మోసాన్ని అరికట్టడంలో సహాయపడే ఫెసిలిటేటర్, సర్వీస్ ప్రొవైడర్.

జీఎస్టీ చాలా క్లిష్టంగా ఉందని.. నిజాయతీపరుడైన పన్ను చెల్లింపుదారులను కూడా జైలులో పెట్టవచ్చని కేజ్రీవాల్ తప్పుడు అంచనా వేస్తున్నారు. ఇది నిజం కాదు. జీఎస్టీటీ చట్టం పన్ను చెల్లింపుదారులకు వివిధ రక్షణలు, పరిష్కారాలను అందిస్తుంది. 40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉంది.

ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటయోధుడని చెప్పుకునే కేజ్రీవాల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అవినీతికి అనుకూల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం విచారకరం. అతనికి అవమానకరమైన పతనం. వరుస అబద్ధాలకోరుగా, భయాందోళనకు లోనైన అవినీతిపరుల రక్షకుడిగా, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటంలో తనకు మద్దతిచ్చిన భారత ప్రజల నమ్మకాన్ని, ఆశలను వమ్ము చేశాడు’’ అని విమర్శలు గుప్పించారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం