రూ. 3000 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తల్లి శవాన్ని భుజాలపై మోసుకెళ్లారు

By Mahesh KFirst Published Jan 5, 2023, 7:06 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ. 3000 డిమాండ్ చేశాడు. దీంతో ఆ మొత్తం ఇచ్చుకోలేని కుటుంబం.. ఆమె మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లడానికి ప్రయాణం ప్రారంభించింది. 50 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుంటూనే వెళ్లడానికి ప్రయాణం మొదలు పెట్టారు.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్‌లో తల్లి మరణించింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌తో మాట్లాడితే రూ. 3000 ఇస్తేనే వస్తామని నిష్కర్షగా చెప్పేశారు. రూ. 3000 ఇచ్చే తాహతు లేని ఆ కుటుంబం తమ కాళ్లనే నమ్ముకున్నారు. మృతదేహాన్ని భుజాలపై మోస్తూ సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని సొంతూరికి తండ్రీ కొడుకులు నడుచుకుంటూ బయల్దేరారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లని జల్‌పైగురిలో చోటుచేసుకుంది.

తల్లికి ఒంట్లో బాగాలేదు. తండ్రితో కలిసి జయ క్రిష్ణ దివాన్ ఆమెను క్రాంతి గ్రామం నుంచి జల్‌పైగురి జిల్లాలోని కేకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మరణించింది. తిరిగి ఆమెను ఇంటికి తీసుకెళ్లాల్సి ఉన్నది. దీంతో తమ ఊరి నుంచి జల్‌పైగురి జిల్లాకు తమను తెచ్చిన అంబులెన్స్ దగ్గరకే వెళ్లి మళ్లీ అడిగారు. వచ్చేటప్పుడు రూ. 900 తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొన్ని డబ్బులు ఎక్కువైనా సరే రావాలని కోరారు. కానీ, కొన్ని కాదు.. మూడు రెట్లకు ఎక్కువగానే అంటే రూ. 3000 ఇస్తేనే ఆ ఊరికి వస్తామని అంబులెన్స్ నిర్వాహకులు తెగేసి చెప్పారు.

Also Read: నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజంపై మోస్తూ నడక.. ఆ తరువాత బస్సులో ప్రయాణం.. వైరల్..

జయ క్రిష్ణ దివాన్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘డెడ్ బాడీని శవ వాహనంలో ఇంటికి తీసుకెళ్లడానికి రూ. 3000 డిమాండ్ చేశాడు’ అని తెలిపాడు. ‘నా తల్లిని హాస్పిటల్ తీసుకు వచ్చినప్పుడు అంబులెన్స్‌కు రూ. 900 చార్జ్ చేశారు. అంతకు కొంచెం ఎక్కువైనా సరే మృతదేహాన్ని మా ఇంటికి తీసుకెళ్లాలని వేడుకున్నాం. సహాయం చేయండి కోరాం. కానీ, వారు అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు నేను నిస్సహాయుడిని. నా తల్లి శవాన్ని నా భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది’ అని అన్నాడు. 

ఈ ఘటన హాస్పిటల్ నిర్వహణలోని లోపాలను ఎత్తి చూపుతున్నది. మెడికల్ పరికరాలను ఎలా వినియోగిస్తున్నారనే కోణంలో అనుమానాలు వస్తున్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌లతో కుమ్మక్కు కావడం, ఇతర హాస్పిటల్‌లతో ఒప్పందాలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయని కొందరు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

click me!