మద్యం మత్తు మానసిక వైకల్యానికి సమానం కాదు.. మర్డర్ కేసులో దోషి శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు

By Mahesh KFirst Published Jan 5, 2023, 6:09 PM IST
Highlights

మద్యం మత్తును మానసిక దుర్భలానికి సమానంగా పరిగణనలోకి తీసుకోలేమని, మద్యం మత్తులో హత్య చేశాడని, కాబట్టి, అతడు నిర్దోషే అని వాదించడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాదు, ఐపీసీలోని 84 సెక్షన్ ఈ వాదనను కొట్టేస్తుందని వివరించింది.
 

న్యూఢిల్లీ: మద్యం మత్తు.. మానసిక వైకల్యం వేర్వేరు అని, మద్యం మత్తును మానసిక అనారోగ్యానికి పోలిక తీసి మర్డర్ కేసులో దోషిని నిర్దోషిగా ప్రకటించలేం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2009లో తన ఇద్దరు మైనర్ కుమారులను హత్య చేసిన కేసులో దోషి నేరం చేశాడనే కాదు.. అతడికి విధించిన యావజ్జీవ శిక్షను కూడా సమర్థించింది.

2009లో దోషి తన 9 ఏళ్లు, ఆరేళ్ల ఇద్దరు కుమారులను ఓ కెనాల్ దగ్గరకు తీసుకెళ్లి.. గొంతు నులిమేశాడు. ఆ తర్వాత ఆ కెనాల్‌లో తోసేసి చంపేశాడు. ఆ తర్వాత అది ప్రమాదంగా కథ అల్లాడు. ఆ ఇద్దరు తన వల్లే తన భార్యకు పుట్టలేదేమో అనే అనుమానం అతనిలో ఉన్నట్టు తెలిసింది. అంతా పకడ్బందీగా కేసులోని ఆధారాలు చెరిపేసి నిర్దోషిగా బయటపడే ప్లాన్ వేసుకున్నాడు. కానీ, ఈ కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు.

దోషి తరఫున అడ్వకేట్ షికిల్ సూరి వాదిస్తూ.. హత్య జరిగిన సమయంలో తన క్లయింట్ మద్యం మత్తులో ఉన్నాడని, తాను ఏం చేస్తున్నాడో సరిగ్గా అర్థం కాని స్థితిలో ఉన్నాడని వాదించాడు. ఈ కోణాన్ని కోర్టు పరిశీలించలేదని అన్నాడు. 

Also Read: ములుగు జిల్లాలో కానిస్టేబుల్ హత్యకు ఎస్‌ఐ ప్లాన్.. మావోయిస్టు‌లు ఉన్నారనే భ్రమ కల్పించేలా స్కెచ్!

కానీ, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం ఆ వాదనలను కోట్టివేస్తూ.. ఐపీసీలోని 84 సెక్షన్ ప్రకారం, అడ్వకేట్ వాదనలు చెల్లవని స్పష్టం చేసింది. 

దోషి మద్యానికి బానిస అని, అతడిని డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్చినట్టు ఆధారాలు ఉన్నప్పటికీ.. అక్కడ ఆయన మెంటల్ సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకుంటున్నట్టు ఆధారాలు లేవని వివరించింది. డీ అడిక్షన్ సెంటర్ నుంచి కోర్సు పూర్తి కాకముందే డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. అలాగే, నేరానికి అతను పకడ్బందీగా ప్లాన్ వేశాడని, రుజువులను అంతే చాకచక్యంగా రూపుమాపే ప్రయత్నం చేశాడని, కాబట్టి, అతను మానసికంగా దుర్భలంగా ఉన్నాడని, హత్య జరిగినప్పుడు అతని ఆలోచనలు తన అదుపులో లేవని భావించలేమని పేర్కొంది.

click me!