
బెంగళూరు: బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలో మహిళలు అరుదైన విజయాలు సాధించి చూపెట్టారు. చాలా మంది వారు సాధించిన సాధికారతను వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరు-మైసూరు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం అందరూ మహిళలు కలిసి ఆపరేట్ చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా మహిళా సిబ్బందే ఆపరేట్ చేసింది.
అదనపు రైల్వే మేనేజర్ కుసుమ హరిప్రసాద్ సారథ్యంలో ఇతర రైల్వే అధికారులు, సిబ్బంది కలిసి ఈ ఫీట్ సాధించారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రైల్వే శాఖలోని మహిళా సిబ్బంది అర్థవంతంగా జరుపుకున్నారు. బెంగళూరు-మైసూరు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్‌లో అన్ని విభాగాల్లో మహిళలే ఆపరేట్ చేసి విజయవంతంగా నడిపించారు’ అని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షిస్తూ శుభాకాంక్షలు చెప్పారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా మహిళలను ప్రత్యేకంగా గౌరవించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో దేశంలోని పలు సంస్థలు మహిళా కార్మికులను సత్కరించి, వారి స్ఫూర్తికి వందనం చేశాయి. తాజాగా విమానయాన రంగానికి సంబంధించి ఎయిర్ ఇండియా తన 1,825 మంది పైలట్‌లలో 15 శాతం మంది మహిళలేనని బుధవారం తెలిపింది. దీంతో మహిళా పైలట్ల పరంగా అతిపెద్ద విమానయాన సంస్థగా ఆవిర్భవించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిగా మహిళా సిబ్బందితో 90 విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది.