అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు.. ఆప్ వాకౌట్.. చర్చించిన అంశాలివే

By telugu teamFirst Published Nov 28, 2021, 3:13 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్‌లు హాజరయ్యారు. ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలూ పాల్గొన్నారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆప్ నేత తమను మాట్లాడనివ్వలేదని ఆరోపిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
 

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల(Parliament Session)కు ముందు అఖిలపక్ష సమాశం(All Party Meet) నిర్వహించడం ఆనవాయితీ. రేపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) గైర్హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని, సాగు చట్టాలు సహా పలు అంశాలపై ఆయన తమతో మాట్లాడుతారని ఆశించామని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరై సాంప్రదాయానికి తూట్లు పొడిచారని అన్నారు. కాగా, ఈ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొట్టివేశారు. అలాంటి సాంప్రదాయాలేవీ లేవని, ఇలా హాజరవ్వడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రారంభించారని అన్నారు. ఆయన ఈ రోజు సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. కాగా, తమ గొంతు నొక్కేస్తున్నారని, తమను మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని ఆప్(AAP) నేతలు వాకౌట్ చేశారు.

ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కామర్స్ మినిస్టర్ పియూష్ గోయల్‌లు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మలు, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తిరుచి శివలు ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్, శివసేన నుంచి వినాయక్ రౌత్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, బీజేడీ నుంచి ప్రసన్న ఆచార్య, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూఖ్ అబ్దుల్లా నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు పలు అంశాలు లేవనెత్తాయి.

Also Read: కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ.. పార్లమెంటులో హస్తం పార్టీతో కలువం.. ఆధిపత్య పోరుకు బీజం?

అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నేతలను మాట్లాడినవ్వలేదని ప్రభుత్వంపై ఆప నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. కనీస మద్దతు ధర కోసం చట్టాన్ని తేవాలనే డిమాండ్‌ను తాము లేవదీశామని తెలిపారు. బీఎస్‌ఎఫ్ పరిధి పెంపు సహా పలు అంశాలపై పార్లమెంటులో  చర్చ జరగాలని వివరించామని అన్నారు. కానీ, తాము మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ కారణంగా సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు తెలిపారు. కాగా, చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు పెగాసెస్ నిఘా, ధరల పెరుగుదల, నిరుద్యోగం అంశాలను లేవనెత్తాయి. కాగా, సాగు చట్టాలను రద్దు చేసినా ఇతర విధానాల్లో వాటిని తిరిగి అమలు చేసే ఆందోళనలు కనిపిస్తున్నాయని, వాటిపైనా ప్రధానమంత్రి తమతో మాట్లాడుతారని ఆశించినట్టు కాంగ్రెస్ తెలిపింది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, ఆందోళనల్లో మరణించిన రైతు నిరసనకారులకు పరిహారం పై పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

కాగా, సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవ్వగానే తొలి రోజు మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెడతారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బీజేపీ తమ నేతలు అందరూ తొలి రోజున పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.

click me!