నేడు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో భేటీ కానున్న అఖిలేష్.. చర్చనీయాంశంగా మారిన టూర్..!!

By Sumanth KanukulaFirst Published Jul 3, 2023, 9:40 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ సమావేశం కానున్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇందుకోసం ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు అఖిలేష్ యాదవ్ హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్‌ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్‌కు చేరుకుంటారు. 

అక్కడ అఖిలేష్, కేసీఆర్‌లు కలిసి లంచ్ చేయనున్నారు. అనంతరం అఖిలేష్, కేసీఆర్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన  కొందరు ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, అఖిలేష్‌లు జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో అఖిలేష్ యాదవ్ దాదాపు 3 గంటల పాటు ఉండనున్నారు. అనంతరం ఆయన తిరిగి లక్నోకు బయలుదేరి వెళ్లనున్నారు.  

Also Read: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం.. ఆరా తీస్తున్న ఢిల్లీ పోలీసులు..!!

 

చర్చనీయాంశంగా అఖిలేష్ పర్యటన.. 
కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమిలో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి అఖిలేష్ కూడా హాజరయ్యారు. మరోవైపు విపక్షాల కూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు.. బీఆర్‌ఎస్‌ను బీజేపీ బీ టీమ్‌గా ఆరోపణలు చేస్తున్నాయి. ఆదివారం  ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మోదీ  అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీని  ఓడించినట్టే.. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామని అన్నారు. 

అయితే ఇలాంటి సమయంలో అఖిలేష్ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో చర్చలు జరపనుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రతిపక్షాలు ఐక్యత దిశగా సాగుతున్న వేళ మహారాష్ట్రలోని ఎన్సీపీలో చీలిక రావడం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. 

click me!