100 మంది అమ్మాయిలపై అత్యాచారం కేసు ... నిందితులకు న్యాయస్థానం ఏ శిక్ష వేసిందో తెలుసా..?

By Arun Kumar P  |  First Published Aug 20, 2024, 4:38 PM IST

అమ్మాయిలను అంగట్లో ఆటబొమ్మలుగా భావించిన దుండగులు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 100 మందిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుషం ఎక్కడ జరిగిందంటే... 


పశ్చిమ బెంగాల్ లో ఓ మెడికోపై అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడి అంతమొందించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రజల ప్రాణాలను కాపాడే యువ డాక్టర్ ను ఇంత దారుణంగా చంపడం అందరినీ కలచివేసింది... దీంతో ఈ దారుణానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని యావత్ దేశం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో  ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా... అమ్మాయిల జోలికి వెళ్ళడానికి ఆకతాయిలు భయపడేలా అజ్మీర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దశాబ్దాలుగా సాగుతున్న అమ్మాయిల బ్లాక్ మెయిల్ కేసులో తీర్పును వెలువరించింది న్యాయస్థానం. 

ఇప్పటి  కోల్ కతా మెడికో హత్యాచారం కేసులాగే రాజస్థాన్ లోని అజ్మీర్ పట్టణంలో సరిగ్గా 32 ఏళ్ల కింద అమ్మాయిలపై అత్యాచారం వ్యవహారం బయటపడింది. ఒకరిద్దరు కాదు వందలాదిమంది విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు. ఇతడితో పాటు నఫీస్ చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలతో పాటు మరికొందరు  అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులుగా వున్నారు. ఇలా తొమ్మిదిమందికి ఇప్పటికే శిక్షపడగా మరో ఆరుగురికి తాజాగా శిక్షను ఖరారుచేస్తూ అజ్మీర్ లోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. 

Latest Videos

ఆరుగురు నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇలా అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడిన 18 మందిలో 15 మందికి శిక్ష పడింది. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరొకడిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. ఇంకొకడు పరారీలో వున్నాడు. 

అసలు ఏమిటీ కేసు...: 

1992 సమయంలో అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఫరూక్ చిస్తీ కొనసాగాడు. అతడి అండ చూసుకుని అనుచరులు కాలేజీ అమ్మాయిల వెంటపడేవారు. అమ్మాయిలను నమ్మించి ఫామ్ హౌస్ లు, రెస్టారెంట్ లకు తీసుకెళ్లేవారు... వారికి మత్తమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. అంతటితో ఆగకుండా అమ్మాయి నగ్నచిత్రాలను తీసుకుని బ్లాక్ మెయిల్ చేసేవారు. 

ఇలా ఫరూక్ చిస్తీ గ్యాంగ్ చేతికి చిక్కిన అమ్మాయిలు నిత్యం నరకం చూసేవారు. నగ్న చిత్రాలతో బెదిరించి తెలిసిన అమ్మాయిలను తమవద్దకు తీసుకురావాలని... లేదంటే ఈ ఫోటోలు, వీడియోలను బయటపెడతామని బెదిరించేవారు. ఇలా వందమందికి పైగా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడింది ఫరూక్ చిస్తీ గ్యాంగ్. 

ఈ గ్యాంగ్ చేతిలో 250 మందికిపైగా అమ్మాయిలు బలయినట్లు తెలుస్తోంది. వీరి చేతికి చిక్కిన అమ్మాయిల్లో ఎక్కువమంది 11 ఏళ్ళ నుండి 20 ఏళ్లలోపువారే. అభంశుభం తెలియని మైనర్ బాలికలపై కూడా ఈ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడేది. విషయం బయటపెట్టకుండా నగ్న ఫోటోలు, వీడియోలను తీసి బెదిరించేది. దీంతో చాలాకాలం వీరి అరాచకాలు భయటపడలేదు. కానీ 1992 వీరి పాపం పండి ఈ బ్లాక్ మెయిల్ అత్యాచారం వ్యవహారం బయటకు వచ్చింది.  

click me!