బెంగళూరులోని హెచ్‌ఆర్‌ఎస్ లేఅవుట్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని హెచ్‌ఆర్‌ఎస్ లేఅవుట్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై దారుణంగా దాడి చేసి.. అత్యాచారం చేసి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువతులు, మహిళలు సహా లక్షలాది మంది మహిళల భద్రత కోసం నిరసనలు తెలుపుతున్నారు.
అయితే, ఇంతలోనే బెంగళూరులో దారుణం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బెంగళూరులోని కోరమంగళలో అర్ధరాత్రి వరకు పబ్‌లో గడిపిన యువతి.. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో వాహనం ప్రమాదం జరగడంతో.. సదరు యువతి వాహనాన్ని వదిలి ఆటోలో ప్రయాణించింది. ఇదే అదనుగా భావించిన ఆటో డ్రైవర్.. యువతిని బొమ్మనహళ్లి సమీపంలోని గోదాములోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు సాధారణ స్థితిలోకి వచ్చాక తన స్నేహితురాలికి ఫోన్ చేయగా.. ఆమె వచ్చి ఆస్పత్రిలో చేర్పించింది. వైద్యులు యువతి పరీక్షించి అత్యాచారానికి గురైనట్లు తేల్చారు. ఆస్పత్రి సిబ్బంది హెబ్బగోడి పోలీసులకు సమాచారం అందించగా.. ఈ ఘటనపై హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు ఏశారు.
ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ స్పందించారు. బెంగళూరులో యువతిపై అత్యాచారయత్నం జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని... పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.