ఆగస్టు 11న భోపాల్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శానిటేషన్ అండ్ హైజీన్ స్కీమ్ కింద 19 లక్షల మంది కౌమార బాలికల ఖాతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ రూ.57.18 కోట్లు జమ చేశారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ఆ రాష్ట్రంలో కౌమార బాలికల మెరుగైన ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది. కౌమార బాలికల శుభ్రత, మెరుగైన ఆరోగ్యం కోసం మధ్యప్రదేశ్ సీఎం తీసుకొచ్చిన పథకం ఒక ప్రత్యేక చొరవ అని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ కితాబిచ్చింది.
ఆగస్టు 11న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో బాలికల సంభాషణ, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా పారిశుద్ధ్యం, పరిశుభ్రత పథకం కింద 19 లక్షల మంది బాలికల ఖాతాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 57 కోట్ల 18 లక్షల రూపాయల మొత్తాన్ని బదిలీ చేశారు.
శానిటేషన్ అండ్ హైజీన్ స్కీమ్ కింద 7 నుంచి 12వ తరగతి వరకు బాలికలకు శానిటరీ న్యాప్కిన్ల కోసం ఈ నిధులు కేటాయించారు. ఈ పథకం కింద పాఠశాల, కళాశాల విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు. పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్షా అభియాన్ కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.