
Air India crash in Ahmedabad kills 242: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. లండన్ గాట్విక్‌కు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మెఘని నగర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ విమానం బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ మోడల్‌కి చెందినది. జూన్ 12, 2025న మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే, సుమారు 825 అడుగుల ఎత్తు చేరిన తర్వాత, విమానం విమానాశ్రయం పరిధిని దాటి మేఘని నగర్‌లోని సివిల్ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్ మీద కూలిపోయింది.
విమానంలో మొత్తం 242 మంది ఉండగా, వీరిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. మహిళలు 112, పురుషులు 104, 14 మంది పిల్లలు ( ఇద్దరు శిశువులు) ప్రయాణిస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణికుల జాబితాలో ఉన్నారు.
ప్రమాదం అనంతరం మేఘని నగర్ సమీపంలోని ఫోరెన్సిక్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడింది. అగ్నిమాపక శాఖ అధికారి జయేష్ ఖడియా తెలిపిన ప్రకారం.. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక టెండర్లు మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మంటల తీవ్రంగా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు.
DGCA ప్రకారం, విమానం MAYDAY సంకేతాన్ని ఇచ్చిన కొద్ది సేపటిలోనే రాడార్ కనెక్షన్ కోల్పోయింది. ప్రమాదం స్థలంలో ఇప్పటివరకు కనీసం 60 మృతదేహాలు బయటపడ్డాయని సమాచారం. భారీగా ఎగిసిపడిన మంటల కారణంగా శరీర భాగాలు కాలిపోయాయి. గుర్తుపట్టలేనంతగా మారాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాడీలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, “ఈ విషాద ఘటన చాలా బాధాకరం. మెడికల్ సాయంతో పాటు అత్యవసర సహాయం త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటనలో “AI-171 విమానం ప్రమాదానికి గురైంది. వివరాలు సమీకరిస్తున్నాం. అప్‌డేట్స్ త్వరలో ఇస్తాము” అని పేర్కొన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కూడా ప్రమాదాన్ని పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “విధ్వంసానికి గురైన కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. అత్యవసర కేంద్రాన్ని ప్రారంభించాం” అని పేర్కొన్నారు. అలాగే, బాధిత కుటుంబాలకు కోటీ రూపాయల సాయం ప్రకటించారు.