
ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు మజ్లిస్ చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు మన జవాన్లను చంపుతున్నారని.. మణిపూర్‌లో హింస చెలరేగుతోందని, గ్రామాలు తగలబడుతున్నాయని, జనం తమ ఇళ్లు వదిలి పారిపోతున్నారని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ మాత్రం కేరళ స్టోరీ అనే సినిమా గురించి మాట్లాడటం దిగ్భ్రాంతికరమన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అబద్ధాలు, కల్పిత ప్రచారాలతో తీసిన ది కేరళ స్టోరీని మోడీ ఆశ్రయించాల్సి వచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.
ఇకపోతే.. రిలీజ్ కి ముందే సంచలనంగా మారి అనేక వివాదాలు సృష్టించిన కేరళ స్టోరీ చిత్రం ఈ శుక్రవారం మే 5న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ కూడా వస్తోంది. కానీ వసూళ్లు బావున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కేరళలో గత కొన్నేళ్లలో 32 వేలమంది మహిళలు మిస్ అయ్యారని.. వారందరిని ముస్లింలుగా మర్చి బలవంతంగా ఉగ్రవాద సంస్థలలో జాయిన్ చేశారనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ఏఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ALso Read: కేరళ స్టోరీపై మోడీ నోట ఆ మాట.. మొన్న కోర్టు, ఇప్పుడు ప్రధాని..గాల్లో తేలిపోతూ నిర్మాత కామెంట్స్
అదా శర్మ ఈ చిత్రంలో షాలిని ఉన్నికృష్ణన్ గా ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే టీజర్, ట్రైలర్ విడులయ్యాక కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ లేపింది.
బీజేపీ ప్లాన్ లో భాగంగా ఈ చిత్రాన్ని ఒక ప్రాపగాండా మూవీగా తెరకెక్కించారని ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని ఇతర పార్టీల నేతలు విమర్శించారు. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. కేరళ ప్రతిష్టని దిగజార్చే కుట్రలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించారు అని ఆయన అన్నారు.
అయితే స్వయంగా ప్రధాని మోడీ కేరళ స్టోరీ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టోరీ చిత్రం ఉగ్రవాదుల కుట్రని బయట పెట్టే విధంగా ఉందని మద్దతు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ కేరళ స్టోరీ చిత్రం గురించి ప్రస్తావించారు. స్వయంగా మోడీ అంతటి వారు తమ చిత్రానికి మద్దతు తెలపడంతో చిత్ర నిర్మాత విపుల్ గాల్లో తేలిపోతున్నారు.