
లక్నో: యూపీలోని చందౌలీ జిల్లాలో వ్యవసాయ కార్మికుడు సలావుద్దీన్ కుమారుడు 17 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్ ఉత్తరప్రదేశ్ మాధ్యమిక సంస్కృత శిక్షా పరిషత్ బోర్డు ఉత్తర మాధ్యమ-II (12వ తరగతి) పరీక్షల్లో 82.71శాతం మార్కులు సాధించి... అగ్రస్థానంలో నిలిచాడు. బోర్డు పరీక్షల్లో ఇతర సబ్జెక్టులతో పాటు సంస్కృతం, సాహిత్యం రెండు తప్పనిసరి సబ్జెక్టులుగా ఉన్నాయి.
ఏదో ఒక రోజు సంస్కృత ఉపాధ్యాయుడు కావాలని కలలు కంటున్న ఇర్ఫాన్ 10వ, 12వ తరగతుల పరీక్షలలో మొదటి 20 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక ముస్లిం. తాను ఇర్ఫాన్‌ను సంపూర్ణానంద సంస్కృత ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన సందర్భాన్ని అతని తండ్రి గర్వంగా గుర్తుచేసుకున్నాడు. ఎందుకంటే అతను ఫీజు భరించగలిగే ఏకైక పాఠశాల అదే.
"నేను వ్యవసాయ కూలీని, నాకు రోజుకు రూ. 300 కూలీ వస్తుంది. ప్రతి నెలా కొన్ని రోజులు మాత్రమే పని దొరుకుతుంది. అందుకే ఇర్ఫాన్‌ను ప్రైవేట్ లేదా మరే ఇతర పాఠశాలకు పంపే స్థోమత నాకు లేదు. అతను నా ఓకే సంతానం.. అందుకే అతడు బాగా చదువుకోవాలనుకున్నాను. యేడాదికి రూ. 400-500 మాత్రమే ఫీజు ఉన్న సంపూర్ణానంద సంస్కృత పాఠశాల గురించి తెలిసి అక్కడ చేర్పించాను’’ అని సలావుద్దీన్ అన్నారు.
అగ్నివీరుల కోసం ‘‘ఆసాన్’’ను తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఏం చేస్తుందంటే..
సలావుద్దీన్ మాట్లాడుతూ ఇర్ఫాన్ ఎప్పుడూ చదువులో ముందుండేవాడని.. పాఠశాలలో చేరిన మొదటి రోజు నుంచే సంస్కృత భాషపై ఆసక్తిని పెంచుకున్నాడని తెలిపాడు. మాకు పక్కా ఇల్లు లేదు, ఇంట్లో కనీస సౌకర్యాలు లేవు. కానీ నా కొడుకు ఎప్పుడూ దేని గురించి అడిగేవాడు కాదని చెప్పుకొచ్చాడు.
"ప్రజలు ఒక భాషను ఒక మతంతో ఎందుకు అనుసంధానం చేస్తారో నాకు తెలియదు. హిందువులు ఉర్దూ నేర్చుకోగలరు. ముస్లింలు సంస్కృతంలో రాణించగలరు. నేను గ్రాడ్యుయేట్‌ని, చదువు ప్రాముఖ్యతను నేను గ్రహించాను. ఇర్ఫాన్‌ను ఇది చేయద్దు అది చేయద్దని ఆపలేదు. సంస్కృత భాషను చాలా అందంగా మాట్లాడతాడు, వ్రాస్తాడు. ఇదంతా అతడి అంకితభావం, కృషి వల్లనే సాధ్యం అయ్యింది. దీనివల్లే 12వ తరగతి పరీక్షలకు హాజరైన 13,738 మంది విద్యార్థులను ఓడించగలిగాడు" అన్నారాయన.
ఇర్ఫాన్ తన కలను సాకారం చేసుకోకుండా కుటుంబం అడ్డుకోదని సలావుద్దీన్ చెప్పాడు. "జూనియర్ క్లాసుల్లో 'సంస్కృతం' తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండేది, అక్కడి నుంచే అతనికి భాషపై అభిరుచి ఏర్పడింది. ఇప్పుడు శాస్త్రి (బీఏతో సమానం), ఆచార్య (ఎంఏతో సమానం) చేయాలని యోచిస్తున్నాడు, ఆ తరువాత సంస్కృత అధ్యాపకుడిగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు" అని చెప్పాడు.