కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుడు పీపీఈ పరికరాలను వదిలిపెట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యుడిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
న్యూఢిల్లీ:కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుడు పీపీఈ పరికరాలను వదిలిపెట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యుడిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుడు తన వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పీపీఈ కిట్ ను పక్కన పెట్టి రోగిని కాపాడాడు. రోగిని కాపాడేందుకు తాను ఈ పనిచేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ఎయిమ్స్ లో పనిచేసే డాక్టర్ జహీద్ అబ్దుల్ మజీద్ ది జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా. కరోనా రోగిని ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించే బాధ్యతను అధికారులు ఆయనకు అప్పగించారు. అంబులెన్స్ లో రోగిని తరలించే సమయంలో రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టుగా వైద్యుడు గుర్తించాడు.
రోగి శ్వాస తీసుకొనేందుకు ఏర్పాటు చేసిన గొట్టం పొరపాటున ఊడిపోయి రోగి ఇబ్బంది పడుతున్నట్టుగా డాక్టర్ మజీద్ గుర్తించాడు. అయితే ఆ గొట్టాన్ని యధాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి
అంబులెన్స్ లో సరైన వెలుతురు లేకపోవడంతో పాటు తాను వేసుకొన్న పీపీఈ కిట్, కళ్లద్దాలు ధరించడం వల్ల ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన తన ముఖంపై నుండి పీపీఈ కిట్ ను తొలగించాడు. ఆ తర్వాత రోగి గొంతులో గొట్టం సక్రమంగా అమర్చాడు.
ఈ సమయంలో రోగి నుండి డాక్టర్ కు వైరస్ సంక్రమించే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యుడు చేసిన సేవలను ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజ్ కుమార్ ప్రశంసించారు.
ఈ ఘటన ఈ నెల 8వ తేదీన చోటు చేసుకొంది. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యుడిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.