దేశంలో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 67 వేలు దాటింది.
హైదరాబాద్: భారతదేశంలో కోరనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 4213 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది.
భారతదేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. కొత్తగా గత 24 గంటల్లో 97 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,206కు చేరుకుంది.
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క రోజులో 4 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 3 వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అది కాస్తా 4 వేలు దాటింది.
దేశంలో యాక్టివ్ కేసులు 44,029 ఉన్నాయి. ఇప్పటి వరకు 20,916 చికిత్స పొంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు రికవరీ రేటు 31.15 శాతం ఉంది.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో మోడీ మాట్లాడుతున్నారు.
కాగా, రేపటి నుంచి కొన్ని ప్యాసెంజర్ రైళ్లు నడవనున్నాయి. 15 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. బుకింగ్స్ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతాయి.