
Agnipath Scheme-Incentives: అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ అయిన సైనికులకు కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. నాలుగు సంవత్సరాల పాటు సైనికులను రిక్రూట్‌మెంట్ చేసి, 25 శాతం మందిని మాత్రమే పర్మినెంట్ సర్వీస్‌లో ఉంచి, మిగిలిన వారిని వదిలిపెట్టే పథకమే అగ్నిపథ్. ఇది ఉద్యోగ భద్రతను దూరం చేస్తుందనీ, నాలుగేళ్ల సర్వీసు తర్వాత భవిష్యత్తు అనిశ్చితం చేస్తుందని నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంతో పాలు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. అవి ఖాళీలలో రిజర్వేషన్ నుండి రాష్ట్ర ఉద్యోగాలలో ప్రాధాన్యతనిస్తాయనే హామీ వరకు ఉన్నాయి. అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అనేక మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్నివీరులను ఆర్మీ సేవల నుంచి విడుదల చేసిన తర్వాత తీసుకుంటాయని తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని 10 శాతం రిజర్వేషన్లను అగ్నివీరులకు కేటాయించనున్నట్లు తెలిపారు.
"ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు డిఫెన్స్ సివిలియన్ పోస్టులు మరియు మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబడతాయి. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుత రిజర్వేషన్‌కి అదనంగా ఉంటుంది" అని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్‌లో అగ్నివీరులకు 10 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వయోపరిమితిలో సడలింపులను కూడా ప్రకటించింది. CAPFలు, అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నివీర్‌లకు సూచించిన గరిష్ట వయో పరిమితి కంటే మూడు సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వాలని MHA నిర్ణయించింది. ఇంకా, అగ్నివీరుల మొదటి బ్యాచ్‌కు వయస్సు సడలింపు సూచించిన గరిష్ట వయోపరిమితి కంటే ఐదు సంవత్సరాలు అధికంగా ఉంటుంది.
కేంద్ర క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తమ మంత్రిత్వ శాఖ అగ్నివీరులను క్రీడా రంగంలో శిక్షకులు లేదా పాఠశాలలు మరియు కళాశాలల్లో ఫిజికల్ టీచర్‌ల ఉద్యోగాలను పొందేలా స్వల్పకాలిక కోర్సును తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. "వారు ఆర్మీలో చేరగలిగేంత ఫిట్‌గా ఉన్నప్పుడు, వారిలో చాలా మంది క్రీడలతో అనుబంధం కలిగి ఉంటారు. మేము వారికి ఐదు-ఆరు నెలల కోర్సును అందిస్తాము. వారిని ఫిజికల్ టీచర్లుగా నియమించుకోవాలనే ఆలోచనలు చేస్తున్నాం అని తెలిపారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అగ్నివీరులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏ రకమైన ఉద్యోగాలను అందజేస్తుందో జాబితా చేస్తూ.."అత్యంత నైపుణ్యం కలిగిన, క్రమశిక్షణ కలిగిన మరియు ప్రేరేపిత అగ్నివీర్‌లను తన వివిధ సేవలలో చేర్చుకోవడానికి సివిల్ ఏవియేషన్ ఎదురుచూస్తోంది" అని పేర్కొంది.
పౌర విమానయాన శాఖ అగ్నివీరులకు జాబితా చేసిన ఉద్యోగాలు:
ఎయిర్ ట్రాఫిక్ సేవలు, విమాన సాంకేతిక నిపుణులు, విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్‌హెల్ వాతావరణం, విమాన ప్రమాద పరిశోధకుడి సేవలు, విమాన భద్రత, అడ్మినిస్ట్రేటివ్, IT, కమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్, సరఫరా గొలుసు నిర్వహణ వంటివి ఉన్నాయి.
అగ్నివీరుల కోసం కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ..
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ (MoPSW) శనివారం అగ్నివీర్స్ కోసం ఆరు సేవా మార్గాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అగ్నివీరులకు అవసరమైన శిక్షణను పొందేందుకు వీలు కల్పిస్తుంది. నౌకాదళ అనుభవం మరియు వృత్తిపరమైన ధృవీకరణతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెమ్యునరేటివ్ మర్చంట్ నేవీలో చేరవచ్చు అని పేర్కొంది. నేవీలో NCV CoC హోల్డర్, ఇండియన్ నేవీలో ఎలక్ట్రికల్ రేటింగ్స్ నుండి మర్చంట్ నేవీలో సర్టిఫైడ్ ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్లుగా మరియు ఇండియన్ నేవీలో కుక్ నుండి సర్టిఫైడ్ కుక్ మర్చంట్ గా నియమించుకుంటామని తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో వారి సంబంధిత సంస్థల్లో 'అగ్నివీరుల'లకు ఉపాధి అవకాశాలను అన్వేషించడానికి సమావేశం నిర్వహించింది. ది ట్రిబ్యూన్ వార్తాపత్రిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు మరియు ఆర్థిక సంస్థలు అగ్నివీర్‌లకు వారి విద్యార్హతలు మరియు నైపుణ్యాల ఆధారంగా తగిన సామర్థ్యాలలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించాలని సమావేశంలో నిర్ణయించారు.
పలు రాష్ట్రాలు అగ్నివీరులకు కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు..
ఉత్తర ప్రదేశ్: రాష్ట్రంలో పోలీసు మరియు సంబంధిత సర్వీసుల రిక్రూట్‌మెంట్‌లో యూపీ ప్రభుత్వం అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
మధ్యప్రదేశ్: రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఉత్తరాఖండ్: నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలైన అగ్నివీరులను ఉత్తరాఖండ్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మరియు రాష్ట్రంలో చార్ ధామ్ నిర్వహణలో చేర్చనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పినట్లు ANI పేర్కొంది.
అస్సాం: రాష్ట్రంలో శాశ్వత నివాసి అయిన ప్రతి అగ్నివీరుడు మిలటరీ నుంచి విడుదలయ్యాక రాష్ట్ర పోలీసుల్లోకి వస్తారని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. సైన్యంలో శిక్షణ పొందిన అనుభవం కలిగి ఉండటంతో వారి సేవలు ఉపయోగించుకుంటామని తెలిపారు.
హర్యానా: ప్రత్యేకతలు చెప్పనప్పటికీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర ఉద్యోగాలలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని హామీ ఇచ్చారు.
కర్ణాటక: పోలీస్ పోస్టులను అగ్నివీరుల కోసం రిజర్వ్ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకువస్తుందని రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు.