
టమోటా ధరలు భగ్గుమంటూ సామాన్యుల జేబులకు చిల్లు పెట్టడంతో పాటు ప్రస్తుతం ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్న టమోటాలు వాటి ధరలపై ఒత్తిడి పెంచాయి. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చాలా ప్రాంతాల్లో దిగుబడి చేతికి అంది .. మార్కెట్లకు తరలివస్తోంది. దీంతో టమోటా ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభంచాయి.
ఇదిలావుండగా.. టమోటా ధరలు తగ్గాయని సంబరపడేలోపే ఇప్పుడు అరటి పండు షాక్ ఇవ్వడం ప్రారంభమైంది. బెంగళూరులో కేజీ అరటి పండ్ల ధర రూ.100కు చేరుకుంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేని నేపథ్యంలోనే అరటి పండ్ల ధరలు పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు. దేశ ఐటీ రాజధానిలో విక్రయించే అరటి పండ్లు చాలా వరకు పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచే వస్తాయి. ఎలక్కిబలే, పచ్‌బలే రకాలను కన్నడిగులు ఇష్టంగా తింటారు. హోసూరు, కృష్ణగిరి నుంచి ఈ రకం పండ్లు సరఫరా అవుతాయి.
ALso Read: వానకాలం ఎఫెక్ట్ : ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు !
అయితే ఈ రెండు రకాల అరటి పండ్ల సరఫరా పడిపోయింది. ఓ మాసం క్రితం బిన్నీపేట్ మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల ఎలక్కిబలే రకం పండ్లు వచ్చాయి. కానీ ఇఫ్పుడు అది 1000 క్వింటాళ్లకు పడిపోయిందని వర్తకులు చెబుతున్నారు. బెంగళూరు నుంచి నగర సరిహద్దు జిల్లాలైన తమకూరు, రామనగర, చిక్‌బళ్లాపూర్, అనేకల్, బెంగళూరు రూరల్ ప్రాంతాలకు ఈ అరటి పండ్లు చేరుకుంటాయి. ప్రస్తుతం దిగుబడి తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కేజీ అరటి పండ్ల ధర రూ.100కు చేరుకుంది. అయితే రానున్న రోజుల్లో ఓనం, వినాయక చవితి, విజయ దశమి పర్వదినాలు వుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.