
బెంగుళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర మంత్రులు కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ తీరును నిరసిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన విషయమై తాజాగా ప్రకాష్‌రాజ్ స్పందించారు.
ఢిల్లీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ విషయమై మోడీ నుండి ఎలాంటి స్పందన రాలేదు.
డియర్ సుప్రీం లీడర్..మీరు మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్, యోగా, కసరత్తులతో బిజీగా ఉన్నారని తెలుసు. ఒక్క క్షణం పాటు ఊపిరి పీల్చుకుని చుట్టూ చూడండి. మంచి పని కోసం ధర్నా చేస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. మీరు కూడా మీ డ్యూటీ చేయండని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ధర్నాను విరమించుకోవాలని నిరసిస్తూ కేజ్రీవాల్ ఎల్జీ కార్యాయలయంలో గత ఆరు రోజులుగా ధర్నా చేపడుతున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతాబెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో పాటు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతు పలికారు.