
మణిపూర్‌లో రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తోందని దేశ అత్యుతున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది. మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండకు సంబంధించిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. అందులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు జరిపిన ఘటనకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌లో పరిస్థితులపై సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది.
మంగళవారం విచారణ సందర్భంగా.. మణిపూర్‌లో దర్యాప్తు నీరసంగా సాగుతుందని సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘విచారణ చాలా నీరసంగా ఉంది. అరెస్టులు చేయలేదు. ఇంత కాలం గడిచిన తర్వాత స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయబడుతున్నాయి మే ప్రారంభం నుంచి జూలై చివరి వరకు ఎటువంటి చట్టం లేదని.. రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేశారనే అభిప్రాయాన్ని ఇది కలిగిస్తుంది’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. విచారణలో పురోగతి లేకపోవడం వల్ల, గణనీయమైన సమయం గడిచినప్పటికీ ఎటువంటి అరెస్టులు జరగలేదని వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితి రాజ్యాంగ యంత్రాంగాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని గమనించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 7 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని మణిపూర్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ)ని ఆదేశించింది. న్యాయస్థానం ప్రశ్నలకు సమాధానమివ్వగల స్థితిలో ఉండాలని పేర్కొంది. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల వల్ల న్యాయ వ్యవస్థ సమర్థతపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని ధర్మాసనం పేర్కొంది.
‘‘రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయలేరు.. వారు నియంత్రణ కోల్పోయారు. ఖచ్చితంగా శాంతిభద్రతలు లేవు. శాంతి భద్రతల యంత్రాంగం ప్రజలను రక్షించలేకపోతే.. పౌరులకు రక్షణ ఎలా?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇక, మణిపూర్‌లో మహిళలు నగ్నంగా ఊరేగింపు జరిపిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాధారణ ఎఫ్‌ఐఆర్ నమోదు తేదీ, నమోదైన స్టేట్‌మెంట్‌ల వివరాలు, అరెస్ట్‌లు జరిగిన తేదీలను పేర్కొంటూ స్టేట్‌మెంట్‌ను సిద్ధం చేయాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐ విచారించడం సాధ్యం కాదని పేర్కొన్న ధర్మాసనం.. ఈ అంశాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్జిలతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోను ‘‘తీవ్రంగా కలవరపరిచేది’’ అని పేర్కొన్న ధర్మాసనం.. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో రాష్ట్ర పోలీసుల విపరీతమైన జాప్యాన్ని మరోసారి ప్రశ్నించింది.
అయితే ఇప్పటి వరకు 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని.. 252 మందిని అరెస్టు చేశారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. వాటిలో 11 ఎఫ్‌ఐఆర్‌లు మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించినవి అని పేర్కొన్నారు.