
రోజులాగే ఆ స్కూల్ లో పిల్లలకు మధ్యాహ్నం సెలవు ఇచ్చేశారు. దీంతో పిల్లలు వారి ఇళ్లకు చేరేందుకు బస్సు ఎక్కారు. కానీ బస్సు ఇంటికి వెళ్లడం చాలా ఆలస్యం అయ్యింది. ఇంటి దగ్గర ఆ పిల్లల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. చాలా ఆలస్యమైనా ఇంటికి రాకపోయేసరికి తీవ్ర ఆందోళన చెందారు. ఆ స్కూల్ సిబ్బందికి కాల్ చేశారు. పోలీసులకు కూడా కాల్ చేశారు. బస్సులో చాలా మంది పిల్లలు ఉండటంతో పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. వెతకడం ప్రారంభించారు. అంత మంది పిల్లలు ఉన్న బస్సు ఒకే సారి కనిపించకుండా పోవడంతో ఆ పట్టణంలో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి బస్సు కనిపించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే ?
అది ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో గల పోదర్ స్కూల్.. స్కూల్ కు మధ్యాహ్నం సెలవు ఇచ్చేశారు. దీంతో పిల్లలంతా మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు. అయితే స్కూల్ ఆవరణలో నుంచి మధ్యాహ్నం బయలుదేరిన బస్సు కొన్ని గంటల పాటు గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనం చెందారు. వెంటనే స్కూల్ కు చేరుకొన్నారు. గేట్ల వద్ద నిలబడి ఆందోళన వ్యకం చేశారు. తమ పిల్లలు ఇంత వరకు ఇంటికి చేరుకోలేదని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ బస్సు డ్రైవర్ కు అందరూ కాల్ చేశారు. కానీ అతడి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెరిగింది. అయితే అందరిని ఆందోళనలను తగ్గిస్తూ చివరికి నాలుగు గంటలకు ఆ బస్సు పిల్లల ఇంటి ముందరకు చేరింది. ఏం జరిగిందని డ్రైవర్ ను ఆరా తీస్తే తనకు రూట్లు సరిగా తెలియదని, అందుకే ఆలస్యమైందని ఆయన చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్కూల్ బస్సు తప్పిపోయిందనే వార్తలు ముంబైలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు స్పందించారు. ఏం జరిగిందో వివరించారు. బస్సు డ్రైవర్ కొత్తవాడని తెలిపారు. బస్సు రూట్ లు సరిగా లేవని, అందుకే ఆలస్యమైందని చెప్పారు. ‘‘ పిల్లలు ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ఈ బస్సు సురక్షితంగా ఉంది. అందులోని విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారు. స్కూల్ టైమింగ్స్, బస్సు రూట్ లపై ఆయనకు అవగాహన లేదు. బస్సులో 25-30 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా బాగానే ఉన్నారు ’’ అని డీసీపీ శివాజీ రాథోడ్ తెలిపారు.
ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. “ ఈరోజు జరిగిన రవాణా సేవలలో ఆలస్యం కారణంగా మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మేము చింతిస్తున్నాము. రాబోయే రోజుల్లో రవాణా సేవలు సాధారణ స్థితికి వచ్చేలా సిబ్బందికి పూర్తి శిక్షణ ఇస్తాం’’ అని ప్రకటన పేర్కొంది.