
మహారాష్ట్రలో ఓ అరుదైన రాజకీయ సన్నివేశం ఆవిష్కృతమైంది. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ఒకే వేదికను పంచుకున్నారు. దివంగత కాంగ్రెస్ నేత రామకృష్ణ మోరేపై రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పుణె సమీపంలోని పింప్రి చించ్వాడ్ లో గురువారం జరిగింది. ఈ పుస్తకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, దిగ్విజయ్ సింగ్ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఆషాఢ ఏకాదశి సందర్భంగా నడుచుకుంటూ పండరీపూర్ కు వచ్చి పూజలు చేసిన దిగ్విజయ్ సింగ్ ను కొనియాడారు. ‘‘నేను మీకంటే చిన్నవాడిని. అయినా నాకు అంత ధైర్యం (నడవడానికి) లభించదు. కానీ మీరు (తీర్థయాత్ర సమయంలో) చాలా నడుస్తారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని అన్నారు.
దిగ్విజయ్ సింగ్ సమాధానిస్తూ. తన లాగే గడ్కరీ కూడా ఒక సారి పాదయాత్రగా పండరీపూర్ కు రావాలని కోరారు. ఒక సారి వస్తే క్రమం తప్పకుండా రావాలనిపిస్తుందని సూచించారు. కాగా.. ఈ సందర్భంగా మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని కూడా గడ్కరీ కొనియాడారు. రాష్ట్రంలో వివిధ పార్టీలు ఉన్నప్పటికీ వాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.
అర్ధరాత్రి అన్యూహ పరిణామాలు..సెంథిల్ బాలాజీ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు గవర్నర్
అభిప్రాయ భేదాలు ఉండవచ్చునని, కానీ సంబంధాల్లో విభేదాలు ఉండకూడదని, దానికి మహారాష్ట్ర చక్కటి ఉదాహరణ అని అన్నారు. రూ.12,000 కోట్ల వ్యయంతో పాల్ఖీ మార్గ్ (పల్లకీ మార్గం)ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. వేడి రోడ్డుపై చెప్పులు లేకుండా వార్కారీలు నడిచేలా మార్గం పొడవునా గడ్డి వేయాలని ఇంజనీర్లను కోరినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో ఉన్న విఠల్ స్వామి, రుక్మిణీ దేవి కొలువుదీరిన ప్రసిద్ధ ఆలయం ఉన్న పండరీపూర్ ను దిగ్విజయ్ సింగ్ ప్రతీ సంవత్సరం ఆషాఢి ఏకాదశి నాడు సందర్శిస్తాడు. భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంత్ తుకారం, సంత్ జ్ఞానేశ్వర్ పవిత్ర పాదముద్రలతో కూడిన పల్లకిలు లక్షలాది మంది 'వార్కారీలు' (భక్తులు) తో కలిసి పట్టణానికి చేరుకుంటాయి.