
విమానం గాలిలో ఎగురుతోంది. అందులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. అదే విమానంలో ఓ 40 ఏళ్ల ప్రయాణికుడు కూడా ఉన్నాడు. అయితే అతడికి ఏమైందో ఏమో తెలియదు గానీ.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తరువాత అతడు మత్తులో ఉన్నాడని సిబ్బంది గమనించారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ-బెంగళూరు ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించిన 40 ఏళ్ల ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని విమానయాన సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. 6ఈ 308 అనే విమానంలో శుక్రవారం ఉదయం 7.56 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
విమానానికి ఏదైనా ప్రమాదం తలెత్తినప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చేందుకు ఎమర్జెన్సీ డోర్ ను ఉపయోగిస్తారు. అయితే ఈ విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే కెప్టెన్ అప్రమత్తం చేశారు. దీంతో పాటు ఆ ప్రయాణికుడిని హెచ్చరించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విమానాన్నిసురక్షితంగా నడపడంలో ఎలాంటి రాజీ పడలేదని అని ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడిని కర్ణాటక రాజధాని బెంగళూరులో దిగిన తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. తరువాత అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇండిగో విమానంలో 40 ఏళ్ల వ్యక్తి ముంబైకి వెళ్తున్నాడు. అయితే విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కవర్ ను తొలగించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.