
దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు ఎవరికీ ఏ గాయాలు కాలేదు. బిల్డింగ్ లోని నార్త్ బ్లాక్‌లోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ గదిలో అర్ధరాత్రి 12.18 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు.
‘‘ సుమారు 12:18 గంటలకు అగ్నిమాపక విభాగానికి నార్త్ బ్లాక్ (హోమ్ మినిస్ట్రీ రూమ్ నంబర్ 82 A, B) టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో నుండి అగ్నిమాపక కేంద్రానికి కాల్ వచ్చింది” అని ఫైర్ సిబ్బంది ఒకరు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే మంటలను అదుపు చేసేందుకు ఏడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
ఏడు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించడంతో సుమారు 1.05 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణం ఏంటనే విషయాలు ఇంకా తెలియరాలేదని అగ్నిమాక సిబ్బంది ఒకరు వార్తా సంస్థ ఏఎన్ఐకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇదే ఢిల్లో గత నెల 13వ తేదీన భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా విషాదాన్ని రేకెత్తించింది.
మూడు రోజుల కింద ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 12 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ కెమికల్ ఫాక్టరీ జాతీయ రాజధాని న్యూ ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్క సారిగా బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసు ప్రతినిధి సురేంద్ర సింగ్ ‘రాయిటర్స్’కు తెలిపారు.
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు.. 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల కమిషన్
పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయి. ఫ్యాక్టరీలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోంది. ’’ అని మోదీ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, ఈ ఘటనపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపించాలని సీఎంను ఆదేశించారు.