చాయ్, సమోసాలతో రెబల్స్‌ను రాజీకి తెచ్చే ‘రాజా సాహెబ్’ ఆర్‌పీఎన్ సింగ్ గురించి మీకు తెలుసా?

By Mahesh KFirst Published Jan 25, 2022, 5:19 PM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు విశేష సేవలు అందించిన ఆర్‌పీఎన్ సింగ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌంథ్వార్ రాజవంశీకుడు. ఆయన తండ్రి సీపీఎన్ సింగ్ కూడా కాంగ్రెస్ నాయకుడే. కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు కూడా. ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌పీఎన్ సింగ్.. కాంగ్రెస్‌కు ఎంతో అండగా ఉండేవారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని తెలుస్తున్నది. ఆయన గురించిన వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్(RPN Singh) ఆ పార్టీకి రాజీనామా(Resignation) చేసినట్టు ఈ రోజు ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సోనియా గాంధీకి రాసిన లేఖను ఆయన ట్వీట్ చేశారు. తాజాగా, ఆయన బీజేపీ(BJP)లో చేరారు. ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామాతో యూపీలో కాంగ్రెస్‌కు కష్టాలేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఆయన పార్టీ వీడటంతో ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి ఉద్ధండులను గుర్తుకు తెస్తుండటం ఆర్‌పీఎన్ సింగ్ స్థాయి ఏమిటో అర్థం అవుతున్నది. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఆర్‌పీఎన్ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన రాజవంశీకుడు. ఆయన సైంథ్వార్ రాజకుటుంబానికి చెందినవాడు. ఆర్‌పీఎన్ సింగ్‌ పూర్తి పేరు కున్వార్ రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్. ఆయనను రాజా సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఆయన తండ్రి సీపీఎన్ సింగ్ కూడా కాంగ్రెస్‌ నాయుకుడే. ఖుషీనగర్ నుంచే ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా చేశారు. ఆర్‌పీఎన్ సింగ్ కూడా కేంద్రంలో పలు శాఖలకు బాధ్యతలు తీసుకున్నారు. 2011లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రిగా, 2012లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2013 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

ఆర్‌పీఎన్ సింగ్ చాలా ఉదారంగా, హాస్యప్రియుడిగా ఉంటారు. ఆయన తన కార్యాలయంలో విలేకరులతో సరదా ముచ్చట్లే ఎక్కువగా మాట్లాడతారు. కానీ, చాలా సార్లు దాపరికాలు లేకుండా కుండబద్దలు కొడుతూ ఉంటారు. విలేకరులతో చిప్‌లు, డైట్ కోక్‌లతో ఆహ్వానించి తన మాటల విందును అందిస్తారు. పార్టీ నేతలతోనూ సఖ్యంగా ఉండేవారు. అభిప్రాయ బేధాలు వస్తే క్షణంలో మాయం  చేస్తారు. అందుకే పార్టీ నాయకత్వం ఆయనతో సన్నిహితంగా ఉండేది. ఒక్కోసారి సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వచ్చి వారి ఇంటిలోనే ఆశ్రయం తీసుకునేదంటే అర్థం చేసుకోవచ్చు.

ఈ చురుకుదనాన్ని చూసే కాంగ్రెస్ నాయకత్వం ఆర్‌పీఎన్ సింగ్ ఆయనను పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ బాధ్యుడిగా నియమించింది. జార్ఖండ్‌కు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఆయన చేశారు. ఆయన బాధ్యుడిగా ఉన్నప్పుడూ రుసరుసలాడుతూ చాలా మంది పార్టీ నేతలు ఆయన వద్దకు వచ్చే వారు. తాము ఇక ఎంతమాత్రమూ పార్టీలో ఉండబోమని ఆవేశంతో చెప్పుకుపోతుంటే.. ఆర్‌పీఎన్ సింగ్ వారి భుజాలపై నుంచి చేతులు వేసి అల్లుకుని ఒక నవ్వు, ఒక జోకు విసిరి కూల్ చేసేవాడని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. చాయ్, సమోసాలు, చిప్స్‌తో రెబల్స్‌ను మళ్లీ దారికి తెచ్చేవాడని పేర్కొంటాయి. రెండు నిమిషాలు ముచ్చట్లు, ఒక చాయ్, ఒక సమోసా.. అంతే. వాటితోనే రెబల్స్‌ను సులువుగా తన చతురతతో రాజీకి తెచ్చేవాడని చెబుతుంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఆర్‌పీఎన్ ముక్కుసూటి తనంతో కాంగ్రెస్ నాయకత్వాన్ని కొంచెం దూరమైనట్టు భావిస్తున్నారు.

click me!