దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, దేశంలోని మొత్తం కేసుల్లో 89 శాతం కేసులు ఈ రాష్ట్రంలోనే రిపోర్ట్ అయ్యాయని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. కానీ, పినరయి సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మండిపడ్డారు.
Corona Cases: కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కానీ, పినరయి విజయన్ సర్కారు ఎలంటి కట్టడి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కొవిడ్ పై పినరయి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సోమవారం విమర్శించారు. మలప్పురం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు’ అని అన్నారు.
జాతీయ స్థాయిలో కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశం మొత్తంలో 1800 కరోనా కేసులు నమోదైతే.. అందులో 1600 కేసులు కేరళ నుంచే ఉన్నాయని సతీశన్ పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. నిన్న 119 కొత్త కేసులు ఉన్నాయి. నిన్న ఒక మరణం కూడా రిపోర్ట్ అయింది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏమీ స్పందించడం లేదు?’ అని నిలదీశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏ చర్యలు తీసుకుంది? సుమారు 89 శాతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కేరళలోనే నమోదు అయ్యాయి’ అని అన్నారు.
Also Read: కేరళలో కోవిడ్ కేసులు : వృద్ధులు తప్పనిసరి మాస్కులు ధరించాలి.. కర్ణాటక ఆరోగ్యశాఖామంత్రి
‘తమిళనాడు కూడా చర్యలు తీసుకుంటున్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు. అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నదీ చెప్పలేదు. నవ కేరళ సదస్సు ఇప్పుడు కొనసాగుతున్నది. ఇది పూర్తయ్యే వరకు వాళ్లు వేచి చూస్తున్నారు’ అంటూ కామెంట్ చేశారు. సీఎం పినరయి విజయన్, ఆయన మంత్రివర్గ సహచరులు కలిసి రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో నవ కేరళ సదస్సు పేరిట టూర్ చేపడుతున్నారు.
‘ప్రజలు ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళనపడక ముందే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని సతీశన్ పేర్కొన్నారు. మన దేశంలో ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,828కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా వెలుగు చూసిన కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కారణంగా కేరళలో ఒక మరణం కూడా సంభవించింది.