ఆర్ధిక వనరుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి విరాళాలను కోరుతుంది.ఈ మేరకు ఆన్ లైన్ ప్రచారాన్ని ఇవాళ ప్రారంభించింది. దేశం కోసం విరాళం పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.
న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆర్ధిక వనరులను సమకూర్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం విరాళం పేరుతో దేశ వ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని సోమవారంనాడు ప్రారంభించింది.అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం నాడు ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన భారతీయులు ఎవరైనా విరాళం ఇవ్వవచ్చని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
రూ. 138, రూ. 1380, రూ. 13,800లకు పైగా ఎంతైనా విరాళం ఇవ్వవవచ్చని కాంగ్రెస్ తెలిపింది. అయితే డొనేట్ ఫర్ దేశ్ హ్యాష్ ట్యాగ్ ను ప్రచరాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఎదురయ్యాయి. డొనేట్ ఫర్ దేశ్ పేరుతో భారతీయ జనతా పార్టీకి వెబ్ సైట్ ఉంది.
డొనేట్ ఫర్ దేశ్ (DonateForDesh.org)క్లిక్ చేస్తే బీజేపీకి చెందిన వెబ్ సైట్ కి వెళ్తుంది. ఈ డొమైన్ బీజేపీది.అయితే కాంగ్రెస్ పార్టీ డొనేట్ ఫర్ దేశ్ ప్రచారానికి డాట్ ఇన్ డొమైన్ ను స్వంతం చేసుకుంది(donateForDesh.in)
దేశం కోసం విరాళం ఏమిటీ?
మహాత్మాగాంధీ చారిత్రాత్మక తిలక్ స్వరాజ్ ఫండ్ నుండి ప్రేరణ పొందిన కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ తెలిపారు.
దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. దీంతో ఆర్ధికంగా ఆ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిధుల సేకరణకు విరాళాలను మార్గంగా ఎంచుకుంది. ఆర్ధిక వనరుల విషయంలో బీజేపీకి ఇబ్బందులు లేవు. ఎలక్టోరల్ బాండ్స్ పథకం అధికార బీజేపీకి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. డొనేట్ ఫర్ భారత్ కార్యక్రమం ద్వారా తమ పార్టీ 138 ఏళ్ల ప్రయాణం కూడ వివరించనున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్పారు. మెరుగైన భారత దేశం కోసం తమ పార్టీకి మద్దతివ్వాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే. సీ. వేణుగోపాల్ కోరారు. క్రౌడ్ ఫండింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ రెండు ఆన్ లైన్ ఛానెళ్లను, ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేసింది.
విరాళాల కోసం ఆన్ లైన్ లో ప్రచారం డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రతి బూత్ కు కనీసం 10 ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి రూ. 138 విరాళం సేకరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు క్యాంపెయిన్లను కూడ క్షేత్ర స్థాయిలో నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీసీసీ అధ్యక్షులు, ఎఐసీసీ సభ్యులు ఒక్కొక్కరు కనీసం రూ. 1380 విరాళంగా అందించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ కోరారు.
కాంగ్రెస్‌పై బీజేపీ సెటైర్లు
The story and characters in this clip are not imaginary. Resemblance with Congress MP Dhiraj Sahu’s party’s call to seek crowdfunding is intended… pic.twitter.com/5CDyxrWIol
— BJP (@BJP4India)ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు సంబంధించిన అంశాన్ని బీజేపీ ప్రస్తావించింది. 1984లో విడుదలైన బాలీవుడ్ చిత్రం ఇంక్విలాబ్ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది బీజేపీ.