ఒకరు భారత్‌లో, మరొకరు పాకిస్తాన్‌లో : 75 ఏళ్ల తర్వాత అన్నను కలిసిన చెల్లి.. గుండెను పిండేసే దృశ్యం

By Siva KodatiFirst Published Sep 10, 2022, 6:54 PM IST
Highlights

భారతదేశ విభజన బాధలో ఎన్నో తరాలు గడిచిపోయాయి. విభజన సమయంలో పుట్టిన పిల్లలు ఇప్పుడు జీవితంలో చివరి దశకు చేరుకుంటున్నారు. ఈ వయస్సులో, విడిపోయిన వారు కలుసుకున్నప్పుడు, వారి కళ్లలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది.  కర్తార్‌పూర్ సాహిబ్ బుధవారం అటువంటి ప్రత్యేక క్షణాలను చూసింది.

దేశ విభజన సమయంలో తన కుటుంబం నుంచి విడిపోయిన 75 ఏళ్ల తర్వాత కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్‌లో పాకిస్తాన్‌కు చెందిన తన ముస్లిం సోదరురాలిని కలుసుకున్నారు జలంధర్‌కు చెందిన సిక్కు వ్యక్తి అమర్‌జిత్ సింగ్ . దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దేశ విభజన సమయంలో అతని ముస్లిం తల్లిదండ్రులు పాకిస్తాన్‌కు వలసవెళ్లగా.. సింగ్‌ను మాత్రం ఇక్కడే విడిచిపెట్టారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో వీల్‌చైర్‌లో వున్న అమర్‌జిత్ సింగ్ బుధవారం కుల్సుమ్ అక్తర్‌ను కలవడంతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. 

అమర్‌జిత్ తన సోదరిని కలిసేందుకు భారత్, పాక్‌ ప్రభుత్వాల పర్మిషన్ తీసుకుని అట్టారీ - వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్ చేరుకున్నాడు. అటు 65 ఏళ్ల కుల్సూమ్ కూడా సింగ్‌ను చూసిన తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయింది. ఇద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకుని ఏడుస్తూనే వున్నారు. ఆమె తన సోదరుడిని కలవడానికి తన కుమారుడు షాజాద్ అహ్మద్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫైసలాబాద్‌లోని తన స్వగృహం నుంచి వచ్చారు. 

Also REad:అపూర్వ కలయిక : భారత్-పాక్ విభజనలో తప్పిపోయి.. 75 యేళ్ల తరువాత కలుసుకున్నారు..

తన తల్లిదండ్రులు 1947లో జలంధర్‌ శివారు ప్రాంతం నుంచి తన సోదరుడు , సోదరిని విడిచిపెట్టి పాకిస్తాన్‌కు వలస వెళ్లారని కుల్సూమ్ చెప్పారు. తాను పాకిస్తాన్‌లో జన్మించానని, కానీ భారత్‌లో వున్న సోదరుడు, సోదరి గురించి తరచుగా వింటున్నానని ఆమె తెలిపారు. తప్పిపోయిన తన బిడ్డలను తలచుకున్నప్పుడల్లా తన తల్లి ఏడ్చేదని కుల్సూమ్ వాపోయింది. తన అన్నయ్య, చెల్లెల్ని మళ్లీ కలుస్తానని ఊహించలేదని... అయితే కొన్నేళ్ల క్రితం ఆమె తండ్రి సర్దార్ దారా సింగ్ స్నేహితుడు భారత్ నుంచి పాకిస్తాన్ వచ్చి కుల్సూమ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా సర్దార్ దారా సింగ్‌కి కుల్సైమ్ తల్లి.. భారత్‌లో వదిలివెళ్లిన తన కుమార్తె, తన కొడుకు గురించి చెప్పింది. వాళ్ల వూరు పేరు, వాళ్ల ఇంటి లొకేషన్ కూడా చెప్పింది. 

కుల్సూమ్ తల్లి చెప్పిన గుర్తుల ఆధారంగా సర్దార్ దారా సింగ్ పదవాన్ గ్రామంలోని ఆమె ఇంటిని సందర్శించాడు. ఈ క్రమంలో నీ కొడుకు ఇంకా జీవించే వున్నాడని, కుమార్తె చనిపోయిందని ఆమెకు తెలియజేశాడు. 1947లో ఒక సిక్కు కుటుంబం కుల్సూమ్ అన్నయ్యని కుమారుడిని దత్తత తీసుకుని అతనికి అమర్‌జిత్ సింగ్ అని పేరు పెట్టారు. ఈ క్రమంలో తన సోదరుడి క్షేమ సమాచారం తెలుసుకున్న తర్వాత ... కుల్సూమ్ వాట్సాప్ ద్వారా అమర్‌జిత్ సింగ్‌తో మాట్లాడారు. అనంతరం ఓ రోజున ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుల్సూమ్‌కు తీవ్రమైన కడుపునొప్పి వున్నప్పటికీ.. తన సోదరుడిని కలవడానికి ఆమె కర్తార్‌పూర్ వెళ్లింది. 

తన అసలు తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో వున్నారని, వారు ముస్లింలు అని తెలుసుకున్నప్పుడు తనకు షాకింగ్‌గా వుందన్నారు అమర్‌జిత్. అయితే తన కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు కూడా ఒకదానికొకటి విడిపోయాయని ఆయన తనను తాను ఓదార్చుకున్నాడు. అలాగే తన నిజమైన సోదరి, సోదరులను కలవాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు. తన సోదరులు ముగ్గురు సజీవంగా వున్నారని తెలియడం ఆనందంగా వుందన్నాడు. త్వరలో తన కుటుంబంతో గడిపేందుకు పాకిస్తాన్‌కు వెళ్తానని అమర్‌జిత్ చెప్పాడు. 

అలాగే సిక్కు కుటుంబాన్ని కలుసుకునేందుకు వీలుగా తన కుటుంబాన్ని భారత్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు అమర్‌జిత్ తెలిపారు. అలాగే తన సోదరికి విలువైన కానుక ఇచ్చాడు. కుల్సూమ్ కుమారుడు షాజాద్ అహ్మద్ మాట్లాడుతూ.. తన అమ్మమ్మ, తల్లి మాటల్లో తన మామయ్య గురించి విన్నానని ఇప్పుడు ఆయనను కలవడం ఆనందంగా వుందన్నారు. 

click me!