
గుజరాత్ : మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ గురించి అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. పెళ్లి పేరుతో మోసం చేసి అమ్మాయిల దగ్గర నగలు, కట్నం తీసుకుని పారిపోయే పెళ్ళికొడుకులు. పెళ్లి కాలేదని చెప్పి వివాహం చేసుకొని పెళ్లయిన వారంలోనే భర్త ఇంటిని దోపిడీ చేసిన భార్యలు.. పెళ్లి పేరుతో తనకు ఆల్రెడీ పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి శారీరకంగా వాడుకున్న సంఘటనలు.. మ్యాట్రిమోనీలో పెళ్లి కాలేదని పెట్టి వరుసగా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్న ఉదంతాలు.. ఇలా తవ్వుతూ పోతుంటే మ్యాట్రిమోనియల్ పేరుతో జరిగే మోసాలు అనేకం వెలుగులోకి వస్తాయి. అలాంటి కోవలోకి వచ్చే ఓ ఉదంతమే తాజాగా అహ్మదాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ మహిళతో ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకున్నాడు ఓ వ్యక్తి. కానీ, ఆరు నెలల తర్వాత తాను ప్రేమించి, పెళ్లి చేసుకున్న మహిళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలియడంతో షాక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి పెళ్లి ప్రయత్నాలు చేస్తూ తనకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమోనియల్ యాప్ లో పెట్టాడు. అదే యాప్లో ఓ మహిళతో అతడికి పరిచయమైంది. ఆమెకు అప్పటికే వివాహమై, భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరి పెళ్లి కూడా చేసుకున్నారు.
విషాదం.. అగ్గిపెట్టెతో ఆట.. ప్రమాదవశాత్తు నిప్పంటించుకుని బాలుడు మృతి..
ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. అతనికి అస్సాంలోనే గౌహతికి చెందిన రీటా దాస్ అనే మహిళతో మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయం అయింది. ఆమె తనకు అప్పటికే పెళ్లయిందని.. భర్తతో విడాకులు తీసుకున్నానని ఒంటరిగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. చిన్నతనంలోనే తనకు పెళ్లి కావడంతో ఇవన్నీ జరిగిపోయాయని నమ్మించింది. ఆమె చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన అతను ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కొద్ది నెలల క్రితం ఇద్దరు పెళ్లికూడా చేసుకున్నారు.
అహ్మదాబాద్ లోనే పెళ్లి చేసుకుని, కాపురం పెట్టారు. కాగా, ఆరు నెలల తర్వాత గౌహతిలో తన భూమికి సంబంధించిన గొడవ ఉందంటూ రీటా దాస్ ఊరికి వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె నాలుగు రోజులైనా తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ భర్త ఆమెకి ఫోన్ చేశాడు. అయితే ఆమె ఫోన్ ఎత్తిన వ్యక్తి తనను తాను లాయర్ గా పరిచయం చేసుకున్నాడు. అతని భార్య ప్రస్తుతం జైల్లో ఉందని.. ఆమెను విడిపించాలంటే బెయిల్ కోసం లక్ష రూపాయలు కావాలని అడిగాడు. ఏం జరిగిందో తెలియని భర్త ఆ మొత్తాన్ని పంపించాడు.
అయితే లాయర్ పంపిన పేపర్లలో రీటా దాస్ అనే పేరుకు బదులు రీటా చౌహాన్ అనే పేరు ఉండడం అతనికి అనుమానం వచ్చింది. దీంతో, వెంటనే మళ్ళీ తన భార్య ఫోన్ కి కాల్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అనుమానం పెరిగిపోవడంతో రీటాచౌహన్ పేరును గూగుల్లో వెతికాడు. అక్కడ కనిపించిన వివరాలు చూసి షాక్ అయ్యాడు. భార్యకు గతంలో పెద్ద నేర చరిత్రే ఉంది.
గతంలో ఐదువేల కార్ల చోరీతోపాటు.. ఖడ్గం మృగాలను వేటాడటం, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి అనేక పెద్ద పెద్ద కేసుల్లో ఆమె మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉంది అని తెలిసింది. ఈ కేసులకు సంబంధించి రీటా చౌహాన్ మొదటి భర్త అనిల్ ను పోలీసులు ఇటీవలే అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాతే అతనితో ప్రేమ, పెళ్లి చేసుకున్నట్లు తెలిసి రావడంతో రెండో భర్త మోసపోయిన సంగతి గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.