ఐదుగురు ఎంపీలకు పాజిటివ్, పార్లమెంట్‌లో కలకలం: బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published Sep 13, 2020, 4:33 PM IST
Highlights

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి పలు ప్రదేశాల నుంచి రియల్ టైమ్‌లో ఉభయ సభలు సమావేశం కానున్నాయి

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి పలు ప్రదేశాల నుంచి రియల్ టైమ్‌లో ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సమావేశాల తొలి రోజు ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరగనున్నాయి.

ఈ నెల 15 నుంచి ఉదయం 11 గంటలకు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్ రన్ నిర్వహించారు.

సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడూ విధిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలని, సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురు సభ్యులకు పాజిటివ్ రావడంతో ప్రస్తుతం కలకలం రేపుతోంది.

పాజిటివ్ రావడంతో అటు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది, ఇంటిలో పనివారికి కూడా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే పార్లమెంట్ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుంది. రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువగా వృద్ధులు ఉండటంతో, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావం తర్వాత తొలిసారిగా సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంట్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

సభ్యులందరికీ ముందు జాగ్రత్త చర్యగా కిట్లు సరఫరా చేశారు. అత్యవసర సిబ్బంది, అంబులెన్స్ అన్ని రకాల వ్యవస్థలను అధికారులు సిద్ధం చేశారు. సందర్శకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు.

ఇక పార్లమెంట్ భవనాన్ని 46 మందితో కూడిన ప్రత్యేక బృందం ఇప్పటికే పూర్తిగా శానిటైజ్ చేసింది. ఉభయ సభలూ జరిగే సమయంలోనూ ప్రతిరోజూ శానిటైజ్ చేస్తామని,ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు లాక్‌డౌన్ తర్వాత సమస్యలు, వలస కూలీలు, ఉపాధి కల్పన, చైనాతో తలెత్తిన సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. లోక్‌సభలో చర్చించాల్సిన అంశాలపై స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.

బీఏసీ మీటింగ్‌కు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలపై అన్ని పార్టీలు చర్చించారు. ఈ మీటింగ్‌లో ప్రశ్నోత్తరాల సమయం రద్దు, జీరో అవర్ కుదింపు వంటి అంశాలపై చర్చించారు.

దేశంలో కరోనా పరిస్థితులు, ఇండో చైనా మధ్య రగడ, కుంగుతున్న ఎకానమీ, అలాగే కరోనా వైరస్ వంటి ముఖ్యమైన విషయాలకు సమయాన్ని కేటాయించాలని కోరారు. వీటిని చర్చించడానికి స్పీకర్‌ను కోరారు.

అయితే తమ బిల్లులను పాస్ చేసుకోవడానికే కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు తెలిపారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి. శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి.

ఉభయ సభలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగనున్నాయి. 

click me!