బీహార్ కోసం ఎంతో శ్రమిస్తున్నారు: నితీశ్‌ను ఆకాశానికెత్తేసిన మోడీ

By Siva KodatiFirst Published Sep 13, 2020, 3:13 PM IST
Highlights

బీహార్‌లో పెట్రోలియం శాఖకు చెందిన రూ.900 కోట్ల విలువైన మూడు ప్రాజెక్ట్‌లను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం జాతికి అంకితం చేశారు.

బీహార్‌లో పెట్రోలియం శాఖకు చెందిన రూ.900 కోట్ల విలువైన మూడు ప్రాజెక్ట్‌లను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం నితీశ్ కుమార్ బీహార్ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు.

గతంలో బీహార్ అభివృద్ధికి దూరమైందని ఆర్ధిక మాంద్యం, రాజకీయాలే దానికి కారణం కావచ్చునని మోడీ అభిప్రాయపడ్డారు. బీహార్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహాయపడుతుందని ఆయన హామీ ఇచ్చారు.

బీహార్‌లో రోడ్లు, ఇంటర్నెట్ పూర్తిగా ఉండేవి కావని మోడీ అన్నారు. రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని మోడీ చెప్పారు. నవభారత్, నవ బీహార్‌ దిశగా రాష్ట్రంలోని నితీశ్ ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు.  

గ్యాస్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు బీహార్‌లో ఛాలెంజ్‌తో కూడిన విషయమని, అయితే ప్రస్తుత సాంకేతిక వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోడవ్వడంతో అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉజ్వల యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెన్షన్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి స్వరాష్ట్రానికి వచ్చిన వారితో బీహార్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే నూతన ఉపాధి కల్పనకు అవకాశం ఏర్పడిందని ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను సక్రమంగా పాటించాలని కోరారు. అలాగే మాస్కులు ధరిస్తూ, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. 

click me!