
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా నైవేలీలోని పవర్ ప్లాంట్ లో బుధవారం నాడు బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నైవేలీ పవర్ ప్లాంట్ లోని స్టేజ్ 2 లో బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. బాయిలర్ పేలడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఆసుపత్రిలో మరో 13 మంది చికిత్స పొందుతున్నారు.
ఈ ఏడాది మే 7వ తేదీన ఇదే ఫ్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 5 మంది మరణించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆ:దోళన కల్గిస్తోంది. ఏపీ రాష్ట్రంలో మూడు పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.
ఇవాళ జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా తీవ్రంగా కాలిపోయినట్టుగా స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మే మాసంలో ప్రమాదం జరిగిన తర్వాత కూడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ ప్రమాదం వాటిల్లిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.