Opposition MPs Suspended: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తదితర అంశాల నేపథ్యంలో పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళం మధ్య లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వారిలో 9 మంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో లోక్ సభ నుంచి పలువురు ప్రతిపక్ష ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. 15 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో తొమ్మిది మంది కాంగ్రెస్ కు చెందినవారు ఉన్నారు. మిగిలిన సమావేశాలకు ఎంపీలను హాజరుకాకుండా సస్పెండ్ చేశారు. గందరగోళం మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి 15 మంది ఎంపీలను రెండుసార్లు సస్పెండ్ చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ నాయకులు...
లోక్ సభ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సీపీఎం నుంచి ఇద్దరు, డీఎంకే నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఒక ఎంపీ సీపీఐకి చెందినవారు కాగా.. మొత్తం 15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
సస్పెన్షన్ వేటుపడిన ఎంపీలే ఎవరంటే..?
లోక్ సభ సమావేశాల నుంచి సస్పెన్షన్ వేటుపడిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలలో టీఎన్ ప్రతాపన్, హిబి ఈడెన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ లు ఉన్నారు. వారిని మిగిలిన సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఉదయం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారందరి సస్పెన్షన్ కు లోక్ సభ స్పీకర్ ఆమోదం తెలిపారు. అనంతరం 9 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తొమ్మిది మంది ఎంపీల్లో కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఉన్నారు. మొత్తంగా సస్పెన్షన్ కు గురైన తొమ్మిది మంది ఎంపీల్లో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకంఠన్, బెన్నీ బెహనన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్ ఆర్ పార్తిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేశన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ ఉన్నారు.
ఎందుకు ఈ సస్పెన్షన్..
పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై ఉభయసభల్లో చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై చర్చ జరగాలనీ, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా నోటీసును రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసుగా సస్పెండ్ చేశారు.