
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చార్ ధామ్ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ బస్సులో 28 మంది ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
చార్ ధామ్ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాకు చెందిన 28 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా దమ్టా సమీపంలో లోయలో పడిపోయింది. దీంతో అక్కడికక్కడే 22 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ బస్సు యమునోత్రికి వెళ్లాల్సి ఉంది.
ఈ ప్రమాదం బాధాకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో ఆయన మాట్లాడి పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.
స్థానిక యంత్రాంగం, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ కూడా త్వరలోనే అక్కడికి చేరుకుంటుందని అమిత్ షా ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ సీఎం ధామి జిల్లా యంత్రాంగాన్ని సత్వర సహాయ, సహాయక చర్యల కోసం ఆదేశించినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో అలాగే స్థానిక అధికార యంత్రాంగంతో తాను, తన బృందం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు, మృతదేహాలను మధ్యప్రదేశ్ కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘‘ ఈ విషాద సమయంలో ఏ కుటుంబం ఒంటరిగా ఉండకూడదు. మేము అన్ని బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం’’ అని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్ సీఎం ధామీ డెహ్రాడూన్ లోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్నట్లు ఆ రాష్ట్ర సీఎంవో తెలిపింది. కాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘‘ఉత్తరాఖండ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రజలు చనిపోయారనే విషాద వార్త నన్ను కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.