
చెన్నై ఎయిర్‌పోర్ట్ (chennai airport) లో అక్రమంగా తరలిస్తున్న 2.67 కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ కస్టమ్స్ (chennai air customs) అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.40 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
దుబాయ్ (dubai), షార్జా (sharja) నుంచి తెల్లవారుజామున వరుసగా 4 గంటలు, 4.30 గంటలకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తమ మలద్వారంలో బంగారం ఉన్నట్టు ఒప్పుకున్నారు. అందులో 10 బంగారు మూటలు, బంగారు కట్ బిట్‌లు, గొలుసులు మొత్తం 2.67 కిలోల బరువున్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉండగా.. సోమవారం తెల్లవారుజామున మిడిల్ ఈస్ట్ నుంచి వివిధ విమానాల్లో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (cochin international airport) చేరుకున్న ఏడుగురు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (dri), కొచ్చి 6.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో వచ్చిన రతీష్ అనే ప్రయాణికుడి నుంచి సుమారు 1.10 కిలోల బంగారం మిశ్రమాలను, దుబాయ్ విమానంలో వచ్చిన కాసరగోడ్ నివాసి మహ్మద్ అష్రఫ్ నుండి సుమారు 570 గ్రాముల నిషిద్ధ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి వస్తున్న పెరింతల్‌మన్నకు చెందిన అన్సిల్, మువాట్టుపుజాకు చెందిన అష్హర్‌ల నుంచి 1,600 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జెద్దా నుంచి సౌదియా విమానంలో వచ్చిన సైనుల్ అబిద్, నౌఫల్, అబ్దుల్లా నుంచి ఒక్కో కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.నెడుంబస్సేరీ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ జప్తులపై తదుపరి విచారణను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.