
పవిత్ర ఖురాన్‌లో మహిళలు ధరించే దుస్తుల విషయంలో ‘హిజాబ్’ అనే పదాన్ని ఉపయోగించలేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘ఏసియానెట్ న్యూస్’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ హిజాబ్ అనే పదాన్ని ఖురాన్‌లో ఏడు శ్లోకాలలో లేదా ఏడు సందర్భాలలో ఉపయోగించారు. బురఖా కూడా ఒక రకమైన డ్రెస్. దుస్తులకు ఒక నిర్దిష్ట ఆకృతిని తీసుకురావడానికి ముస్లిం చట్టం ప్రయత్నించింది.అందులో భాగంగానే మహిళలతో ముడిపడి ఉన్న అన్ని రకాల దుస్తులకు హిజాబ్‌ను ఉపయోగించారు. కానీ ఖురాన్ మాత్రం మహిళల దుస్తుల విషయంలో హిజాబ్ ను ఉపయోగించలేదు. అయితే ఖురాన్ లో ‘ఖిమర్’ (తల కండువా) అనే పదం ప్రస్తావన ఉంది. ఒక వేళ మీరు ‘లిసాన్-ఉల్-అరబ్’ (అరబిక్ నిఘంటువు) చదివి ఉంటే అందులో ‘ఖిమర్’ ను స్కార్ఫ్‌గా, మహిళలు తమ వెంట తీసుకెళ్లే గుడ్డగా నిర్వచించారు ’’ అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఏసియానెట్ న్యూస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్‌తో చెప్పారు.
"
ఖురాన్‌లో పేర్కొన్న హిజాబ్ సందర్భాన్ని మరింతగా గవర్నర్ వివరిస్తూ.. ‘‘ గతంలో దాదాపు ప్రతీ సమాజం రెండు విభాగాలుగా విభజించబడి ఉండేది. ఇందులో ఒక విభాగంలో స్వేచ్ఛా పురుషులు, స్వేచ్ఛా మహిళలు ఉంటే, మరో విభాగంలో బానిస పురుషులు, బానిస మహిళలు ఉండేవారు. అయితే ఆ సమయంలో దాదాపు చాలా అర్థిక వ్యవస్థలు బానిస ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉండేవి. కానీ నేడు ప్రపంచ వ్యాప్తంగా బానిసత్వం లేదు. ప్రతీ ఒక్కరికీ మానవ హక్కులు ఉంటాయని ఐక్యరాజ్యసమితి ప్రకటన చేసింది. మనకు మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. కాబట్టి హిజాబ్ వేసుకునే అవసరం కూడా లేదు.’’ అని ఆయన అన్నారు.
ముస్లిం మహిళలను ఇళ్లకే పరిమితం చేసేందుకు, వారి అభివృద్ధిని అడ్డుకునేందుకు హిజాబ్ వివాదాన్ని వాడుకుంటున్న వారిపై గవర్నర్ మండిపడ్డారు. సమాజం, దేశ పరిస్థితి మెరుగుపడాలంటే మంచి చదువు ఒక్కటే మార్గమని అన్నారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు యువ తరం దూరంగా ఉంటూ చదువులో రాణించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.