కడియాల కోసం దారుణం.. 108యేళ్ల వృద్ధురాలి కాళ్లు కోసేసిన నిందితులు..

Published : Oct 10, 2022, 10:31 AM IST
కడియాల కోసం దారుణం.. 108యేళ్ల వృద్ధురాలి కాళ్లు కోసేసిన నిందితులు..

సారాంశం

కాలి కడియాల కోసం దుండగులు తెగబడ్డారు. వృద్ధురాలని కూడా చూడకుండా 108యేళ్ల ముసలావిడ కాళ్లు నరికేశారు. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. 

జైపూర్ : రాజస్థాన్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలిపై దాడి చేసిన దుండగులు.. ఆమె కాలికి ఉన్న కడియాల కోసం పాదాలను నరికేశారు. ఆ తరువాత ఆమె బంగారు చెవి కమ్మలు, మెడలోని బంగారు గొలుసుతో పారిపోయారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటన నగరంలోని గల్టా గేట్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. గుర్తుతెలియని దుండగులు 108 ఏళ్ల వృద్ధురాలిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

దాడి తరువాత జమునా దేవి అనే ఆ బాధితురాలు వాష్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె కుమార్తె గోవిందీ దేవి వచ్చి చూసేసరికి ఈ దారుణం కంట పడింది. వెంటనే ఇంట్లో అద్దెకున్నవారి సాయంతో పోలీసు కంట్రోల్ రూమ్‌ కు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు మహిళ పాదాలు నరికి, నగలు దోచుకున్నారని, ఆమె మెడపై పదునైన ఆయుధంతో దాడి చేశారని ఏసీపీ (రామగంజ్) సునీల్ ప్రసాద్ శర్మ తెలిపారు. నేరానికి ఉపయోగించిన ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

కుక్క అనుకుని నక్కను పెంచుకున్నారు.. ఆరునెలల తరువాత ఊళ పెడుతుండడంతో షాక్ అయ్యి...

తెల్లవారుజామున 4:30 గంటల తర్వాత కుటుంబ సభ్యులు నిద్రలేచారు. మిగతా ఇంటి పనులు ప్రారంభించే ముందు కూతురు గోవింది, తల్లి జమునాదేవికి టీ ఇవ్వడం అలవాటు. అలాగే ఆ రోజు కూడా జమున దేవికి టీ ఇచ్చింది. ఆ తరువాత ఇంటిపనుల్లో పడిపోయింది. దీంతో, ఉదయం 5:15 నుండి 6:30 గంటల మధ్య నేరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీనియర్ ఎఫ్‌ఎస్‌ఎల్ శాస్త్రవేత్త అభయ్ ప్రతాప్ సింగ్ ఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించారు.

జమునా దేవి భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడని, ఆమె తన కుమార్తె గోవింది, మనవరాలు మమతతో కలిసి తన ఇంట్లోనే ఉంటోందని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. జమునాదేవి తనంతట తాను నడవలేదని, వాష్‌రూమ్‌కు వెళ్లడానికి, ఇంట్లో తిరగడానికి కూతురు, మనవరాలు సహాయం చేసేవారని తెలిపారు. ఇంట్లో చాలా మంది అద్దెకు ఉంటున్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులు, అద్దెకున్నవారితో మాట్లాడారు. నిందితులకు ఈ కుటుంబం ఎప్పుడు లేస్తుంది.. ఎప్పుడు ఏం చేస్తారు అనే విషయాలన్నీ తెలుసునని అనుమానిస్తున్నారు. 

"ఉదయం తన తల్లికి వాష్ రూం వెళ్లి రావడానికి సాయం చేసి, టీ తయారు చేసి ఇచ్చిన తర్వాత, గోవింది తన పనిలో పడిపోయింది. ఆ తరువాత ఆమె గుడికి వెళ్ళింది. జమునా దేవి చాలా అనారోగ్యంతో ఉండడంతో సహాయం కోసం కేకలు వేయలేకపోయింది" అని పోలీసు అధికారి తెలిపారు. ఇంటి పక్కనే చిన్న బ్రిడ్జి ఉన్నందున దుండగులు బయటి వ్యక్తులు అయి ఉండవచ్చనే విషయం విచారణలో ఉందని పోలీసు అధికారి తెలిపారు. "ఇంటి బయట రోడ్డు ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతుంది. ఇంటి దగ్గర చాలా షాపులు, తినుబండారాలమ్మే బండ్లు ఉన్నాయి" అన్నారాయన.

జమునా దేవి తనంతట తానుగా నడవలేదు. కాబట్టి వాష్‌రూమ్‌కి తీసుకెళ్లిందెవరన్నది పోలీసులకు చిక్కుముడిగా మారింది. అది తెలిస్తే కేసు సులువుగా తేలిపోతుందని ఓ అధికారి తెలిపారు. "ఆమె వృద్ధురాలు, బలహీనురాలు. ఆమె దగ్గరినుంచి నగలు సులభంగా లాక్కోవచ్చు. అయితే, ఒకవేళ ఆమె ప్రతిఘటిస్తే ఆమెను చంపాలనే ఉద్దేశ్యంతోనే నిందితులు వచ్చినట్లు తెలుస్తోంది" అన్నారాయన. దీనిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం