Omicron: ఇండియాలో సెంచరీ దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో నమోదు.. అనవసర ప్రయాణాలు వద్దు: కేంద్రం

By Mahesh K  |  First Published Dec 17, 2021, 5:41 PM IST

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మన దేశంలో 101 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయినట్టు తెలిపింది.
 


న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) కేసులు దేశంలో పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సెంచరీ దాటి 101 నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్(Lav Agarwal) వెల్లడించారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 32 ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజస్తాన్‌లో 17 కేసులు, కర్ణాటక, తెలంగాణల్లో ఎనిమిదేసి కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు గుజరాత్, కేరళలలో ఐదేసి ఒమిక్రాన్ కేసులు, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌, చండీగడ్‌లలో ఒక్కో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం 91 దేశాల్లో రిపోర్ట్ అయిందని లవ్ అగర్వాల్ వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తున్నదని అన్నారు. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం డెల్టా కంటే.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయని చెప్పారు. ఒకవేళ కమ్యూనిటీ స్థాయి వ్యాప్తి జరిగితే ఏ దేశంలోనైనా డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ వేరియంట్ అధిగమించి వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అయితే, టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోలేవని చెప్పడానికి ఆధారాలేవీ లేవని వివరించారు.

Latest Videos

undefined

Also Read: Omicron: మళ్లీ హాట్‌స్పాట్లు.. పలు దేశాల్లో రికార్డు కేసులు.. ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తప్పవా?

అనవసర ప్రయాణాలు విరమించుకోవాలని లవ్ అగర్వాల్ ప్రజలకు సూచించారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని తెలిపారు. ముందు నుంచీ తాము చెబుతూనే ఉన్నామని, పండుగలను ఆడంబరంగా చేసుకోవద్దని, ఎక్కువ మంది గుమిగూడే వేడుకలు వద్దని సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, టీకా వేసుకున్నవారూ తప్పకుండా కొవిడ్ ముందు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఎందుకంటే టీకా అనేది మాస్కుకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.

Also Read: ఢిల్లీలో Omicron పంజా.. తాజాగా మరో పది కేసులు, మొత్తంగా 20కి చేరుకున్న పాజిటివ్ లు...

ఒమిక్రాన్ వేరియంట్‌తో కొన్ని దేశాల్లో కొత్త వేవ్‌లు వచ్చాయి. ఇదే తరహా ముప్పును దేశంలో ఊహిస్తున్న తరుణంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, యూకే, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. యూకేలో ఇప్పటికే 11 వేల ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. యూకేలో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయినట్టే భారత్‌లోనూ జరిగితే ఇక్కడ కేసులు తీవ్ర స్థాయిలో రిపోర్ట్ అవుతాయని కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. యూకే తరహాలోనే కేసులు ఇక్కడ రిపోర్ట్ అయితే.. మన దేశంలోని జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ప్రతి రోజూ 14 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యే ముప్పు ఉందని అన్నారు. అదే ఫ్రాన్స్ తరహా కేసులు నమోదైతే.. మన దేశంలో రోజుకు 13 లక్షల కేసులు రిపోర్ట్ అవుతాయని వివరించారు. మన దేశంలో చాలా వరకు ఒమిక్రాన్ కేసులు బయటి దేశాల నుంచి వచ్చిన వారిలో లేదా.. ట్రావెల్ హిస్టరీ ఉన్నవారిలోనే రిపోర్ట్ అవుతున్నాయని తెలిపారు. అయితే, కొందరు విదేశాలు తిరిగిన చరిత్ర లేనివారిలోనూ ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయని డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

click me!