
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతోంది. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు దళాలను అప్రమత్తం చేయడం ద్వారా ఉద్రిక్తతలను మరింత పెంచింది. ప్రపంచ దేశాలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రత్యేక విమానాల్లో పలువురిని ఇండియాకు తీసుకువచ్చింది.
దాదాపు వంద మంది గుజరాత్ విద్యార్థులు యుద్ధ పీడిత ఉక్రెయిన్ నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన GSRTC ప్రత్యేక బస్సుల ద్వారా ఇంటికి తిరిగి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 44 మంది గుజరాత్ విద్యార్థులు శనివారం ముంబైకి క్షేమంగా తిరిగి వచ్చారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (జిఎస్‌ఆర్‌టిసి) వోల్వో బస్సుల ద్వారా విద్యార్థులను గుజరాత్‌కు తీసుకువచ్చారు. మరో ప్రత్యేక విమానంలో గుజరాత్ విద్యార్థులు ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తిరుగు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 584 మంది రాష్ట్రానికి చెందిన వ్యక్తుల సమాచారం గుజరాత్ ప్రభుత్వం వద్ద ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితుభాయ్ వాఘాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 079-232-38278 హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రారంభించింది, ఇది ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల మధ్య పని చేస్తుందని తెలిపారు. సోమవారం గాంధీనగర్ సర్క్యూట్ హౌస్‌లో ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన ఇరవై ఏడు మంది విద్యార్థులకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. “ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన గుజరాత్‌కు చెందిన సుమారు 100 మంది విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి చేసిన ఏర్పాట్లకు మా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను హంగేరి, పోలాండ్, రోమానియా దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు విమానాల్లో విద్యార్థులను తరలించారు. ఇంకా ఉక్రెయిన్‌లో 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నాడు ప్రధాని మోడీ అధ్యక్షత ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ నేపత్యంలోనే అక్కడ చిక్కుకుపోయిన వారిని త్వరగా తీసుకురావడానికి ప్రభుత్వం కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ వీకే సింగ్‌లను తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.