మిజో గవర్నర్ రాజీనామా: శశి థరూర్ పై పోటీకి రెడీ

By telugu teamFirst Published Mar 8, 2019, 4:17 PM IST
Highlights

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ పై తిరువనంతపురం స్థానం నుంచి రాజశేఖరన్ పోటీ చేయనున్నారు. కేరళలో తన అవసరం ఉందని పార్టీ అధిష్టానం భావించడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

న్యూఢిల్లీ: మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీినామా చేశారు. ఆయన తొమ్మిది నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. కేరళ నుంచి లోకసభకు పోటీ చేసే ఉద్దేశంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ పై తిరువనంతపురం స్థానం నుంచి రాజశేఖరన్ పోటీ చేయనున్నారు. కేరళలో తన అవసరం ఉందని పార్టీ అధిష్టానం భావించడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తాను కూడా కేరళలో ఉండాలని అనుకుంటున్నానని, అది కూడా రాజీనామాకు కారణమని ఆయన అన్నారు. 

రాజశేఖరన్ 2015లో బిజెపి కేరళ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నిరుడు మేలో మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అంగీకరించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. 

రాజశేఖరన్ తిరువనంతపురం నుంచి పోటీ చేస్తారనే వార్త ఎంతో సంతోషకరమైందని కేరళ బిజెపి చీఫ్ పిఎస్ శ్రీధరన్ అన్నారు. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి మిజోరం గవర్నర్ బాధ్యతలను కూడా చూస్తారు. 

రాజశేఖరన్ 2016 ఎన్నికల్లో తిరువనంతపురం జిల్లా వటియుర్కవు సీటు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు కాంగ్రెసు విజయం సాధించగా, సిపిఎం రెండో స్థానంలో నిలిచింది. కాగా, శశిథరూర్ గత రెండు పర్యాయాలు తిరువనంతపురం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. 

రాజశేఖరన్ తొలుత జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత 1976లో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. 1987లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం సమాజ సేవకుడిగా మారారు.

click me!