అరకు: ఎపీలో ఎస్టీ లోకసభ సీటు ఇదొక్కటే, కిశోర్ చంద్రదేవ్ కు పరీక్షే

By telugu teamFirst Published Mar 5, 2019, 1:56 PM IST
Highlights

కిశోర్ చంద్రదేవ్ మరోసారి అరకు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు, సిపిఎంకు ఎదురు దెబ్బ తగిలింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వ్ అయిన లోకసభ స్థానం అరకు ఒక్కటే. నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ నియోజకవర్గం 2008లో ఉనికిలోకి వచ్చింది. 2009 లోకసభ ఎన్నికల్లో కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెసు నుంచి పోటీ చేసి సునాయసంగా విజయం సాధించారు. సిపిఎం అభ్యర్థి మిడియం బాబూరావు ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. 

కిశోర్ చంద్రదేవ్ మరోసారి అరకు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు, సిపిఎంకు ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి గీత 91,398 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి రెండో స్థానంలో నిలిచారు. 

కొత్తపల్లి గీత వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమై జన జాగృతి అనే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే, ఈసారి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ సీటుపై కన్నేసింది. గత నెలలో 400 మంది గిరిజనులు వైసిపిలో చేరారు. వీరిలో 62 మంది సర్పంచులు, 26 మంది మండల పరిషత్ సభ్యులు, 45 మంది మాజీ సర్పంచులు ఉన్నారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలు తమ వైపే ఉన్నారనే ఉద్దేశంతో వైసిపి ఉంది. 

రాజకీయ పార్టీలు గిరిజనుల సంక్షేమానికి ప్రకటించే పథకాలు ఈ నియోజకవర్గంలో కీలకంగా మారే అవకాశం ఉంది. అదే విధంగా కాపులు, ఎస్సీలు, యాదవులు, మత్స్యకారులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. 

తెలుగుదేశం పార్టీకి మావోయిస్టుల దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. గత సెప్టెంబర్ లో మావోయిస్టులు టీడీపి ఎమ్మెల్యే సర్వేశ్వర రావును హతమార్చారు. వైసిపి టికెట్ పై గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపిలోకి జంపయ్యారు. 

click me!