కేసీఆర్ టార్గెట్ కొండా విశ్వేశ్వర రెడ్డి: చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా వ్యాపారవేత్త

By telugu teamFirst Published Mar 9, 2019, 8:29 AM IST
Highlights

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని చేవెళ్ల లోకసభ అభ్యర్థిగా దించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చారు. 

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తమ పార్టీని వీడి, కాంగ్రెసులో చేరిన చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డిని ఓడించేందుకు అవసరమైన వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు రచించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని చేవెళ్ల లోకసభ అభ్యర్థిగా దించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చారు. 

కొండా విశ్వేశ్వర రెడ్డిపై వ్యాపారవేత్త రంజిత్ రెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. మహేందర్ రెడ్డిని, ఆయన సోదరుడు నరేందర్ రెడ్డిని పిలిచి కేసీఆర్ ఆ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. మహేందర్ రెడ్డిని శాసనమండలికి పంపించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అయిన నరేందర్ రెడ్డి కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. 

గత లోకసభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కొండా విశ్వేశ్వర రెడ్డి అనూహ్యంగా కాంగ్రెసు పార్టీలో చేరారు. దీంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషించాల్సి న పరిస్థితి మాత్రమే కాకుండా విశ్వేశ్వర రెడ్డికి ధీటైన అభ్యర్థిని ఖరారు చేయాల్సిన అవసరం కేసీఆర్ కు ఏర్పడింది.

click me!