అల్వాల లక్ష్మణ మూర్తి రాసిన "సూర్యోదయం" ఖండకావ్యం పైన కొల్లాపూర్ నుండి వేదార్థం మధుసూదన శర్మ రాసిన సమీక్షను ఇక్కడ చదవండి.
సూర్యోదయంతో ఈ జగత్తులోని ప్రతి ప్రాణి నిద్ర నుండి మేల్కొని, ఎలా కార్యోన్ముఖులు అవుతారో, అలాగే ప్రముఖ కవి, రచయిత, పాఠ్య పుస్తక రచయిత అయిన అల్వాల లక్ష్మణ మూర్తి గారు తన "సూర్యోదయం" అనే గ్రంథంలో వివిధ సామాజిక అంశాలను స్పృశిస్తూ, వాటి విలువను తెలియజేస్తూ, పద్యాలలో రచించి, ఖండకావ్యం గా మనకు అందించారు. ఇందులోని ప్రతి పద్యం సూర్య కిరణాల వలే, కోటానుకోట్ల దివ్వెలుగా వెలిగి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సమాజంలోని పౌరులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతుంది అని చెప్పవచ్చు.
నాగర్ కర్నూల్ జిల్లా, తాడూరు మండలం, పొలమూరు గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మణ మూర్తి - కల్వకుర్తి పట్టణంలో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా వీరు విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు. ప్రవృత్తి రీత్యా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి, పద్య రచనలు చేస్తూ, దానిలో దిట్ట అనిపించుకున్నారు. వివిధ సందర్భాలలో అనేక సంఘటనలను, ప్రముఖ వ్యక్తులను, ప్రత్యేక విషయాలను గమనించినప్పుడు ఆయా అంశాలపై తమదైన శైలిలో పద్య రూపకంగా వీరు తమ స్పందనలను వెలిబుచ్చారు. అవే "సూర్యోదయం" అనే గ్రంథంగా రూపుదిద్దుకున్నది. ఇందులో సూర్యోదయం, సూర్యాస్తమయం, ప్రకృతి, దేశభక్తి, దైవభక్తి వంటి వాటితో పాటు, నూతన సంవత్సర ఆగమనం, పండగలు, కవిత్వం, కళలు, అష్ట నాయికల వర్ణన, ప్రాంతీయ అభిమానంతో కూడిన అంశాలు మొదలైన నలభై ఖండికలు ఉన్నాయి. వీటితో పాటు తమకు నచ్చిన అంశాలపై రాసిన ముక్తక పద్యాలు ఉన్నాయి. వివిధ సందర్భాలలో జరిగిన అవధాన కార్యక్రమాల్లో దత్తపదులు, న్యస్థాక్షరి వంటి ప్రక్రియలలో వాటికి వీరు చేసిన పూరణ పద్యాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో వివిధ చిత్రాలను చూసి స్పందించి, రచించిన పద్యాలు కూడా ఉండడం విశేషం.
undefined
చక్కని ధారా శుద్ధితో, ఛందోబద్ధమైన పద్యాలను, సరళ సుందరమైన శైలిలో రచించడంలో మేటి అయిన శ్రీ లక్ష్మణ మూర్తి గారు ఈ గ్రంథంలో మొదటి శీర్షిక అయిన "సూర్యోదయం"లో - "కొక్కొరోకోయని కుక్కుటంబులు గూసె పల్లె జనాలను పట్టి లేపె" .. అంటూ "పయనమై సాగే పగటికి పాలకుండు" అని సూర్యుని ఆగమనాన్ని, దాంతో సర్వ ప్రాణులలో కలిగే వివిధ చలనాలను సీస పద్యాలలో బహు చక్కగా వర్ణించారు.
అలాగే వీరు "సూర్యాస్తమయం" అనే మరో ఖండికలో -
"ఉదయాద్రి మొదలుగా ఉద్యమించి జ్వలించి
చండ ప్రచండుడై సంచలించి
దుర్నీతి అవినీతి దుష్టత్వమును రోసి
మార్తాండుడై పగలు మండిపడుచు
శ్రమజీవి కష్టాల శమియింప శాంతించి
తీవ్రతను తగ్గించి తేరు దిగగ"- అని చెప్పి,
"పగటి నేలిన సూర్యుండు పడతి కడకు
ఛాయ నీడకు ప్రచ్చాయ ఛాయ దోప
నరుగుచుండెను పడమర నస్తమింప
దినము ముగిసెను నేడు ప్రతి దినము వోలె"- అని చక్కగా సహజ సుందర శైలిలో వర్ణించిన తీరు ఆమోఘం.
అలాగే వివిధ సామాజిక అంశాలను స్పృశించిన వీరు, రైతు గురించి రాసిన ఒక ఖండికలో -
"అన్నదాత కన్న నాత్మ బంధువుల నెవరు?
రైతు కన్న మిన్న రాజెవండు?
కర్షక కావళి కన్న కష్టించు వారేరి?
సేవలందు మిన్న సేద్యమిలను"- అని రైతుల గొప్పతనాన్ని చెప్పుచూ, రైతును రాజుగా పొగిడాడు.
అలాగే దొరల గడీల పెత్తనం, వర్ణ వ్యవస్థపై పోరాడిన సామాజిక ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ గురించి మరో ఖండికలో -
"వెట్టిచాకిరి నెదిరించి వెన్నుతట్ట
గడిలకంతంబె పంతమై కదిలే దండు
అయిలమాంబయె గర్జించే నదర దొరలు
అరుణ తారగ వెలుగొందు నాకసమున" - అని దొరతనమును ఎదిరించిన దొడ్డ వనిత ఐలమ్మ అని ప్రశంసించాడు కవి.
అలాగే మరో ఖండికలో -
"ఇడుములెదిరించి యోర్పుతో నెదిగినట్టి
మహిళ సావిత్రిబాయిదే మాన్య చరిత
విద్య గరిపించి మహిళల విధిని మార్చె
మొదటి పంతులమ్మ స్త్రీలకు ముదము బెంచె"-అని మహిళలలో విద్యా వికాసానికి కృషి చేసిన మొదటి పంతులమ్మగా సావిత్రీ బాబు పూలెను పద్యారత్నాలతో ప్రస్తుతించాడు.
తెలంగాణ ప్రాంతము,భాష, యాసలపై గౌరవముతో,వాటి గొప్పతనాన్ని -
"రుద్రవీణలు మ్రోగ రుధిరమ్ము పారంగ
నగ్నిధారలు కారె నాగ్రహమున
చిల్లరదేవుళ్ళ చేష్టలు దునుమాడి
నవ సమాజపు దీప్తి న్యాయమనగ
బ్రతుకు నాదియు గాదు ప్రజలదేయని చాటి
నా గొడవను దిద్దే నవపథాన
ప్రజల మనిషియని ప్రభవించి మేల్కొల్పి
తట్టి లేపేను జాతి గట్టి తనమే" - అని
"అన్ని బాటల ధిక్కార మాగ్రహమున
వెల్లువెత్తెను వరదలై వేనవేల
ప్రజల గుండెల మార్మోగె భాష శ్వాస
అట్టి చేవను సొగసుల నద్దికొనిన
నా తెలగాణ యాసగు నవ్య గీత"-అని తెలంగాణ రాష్ట్ర సాధనకై అక్షరాయుధముతో పోరాడిన దాశరథి, కాళోజి, వట్టికోట మొదలైన కవులు, వారి రచనల ద్వారా తెలంగాణ ప్రజల్లో కలిగించిన చైతన్యాన్ని ఈ పద్యాలలో కడు రమణీయంగా చిత్రించారు.
అలాగే స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మనం దీన్ని బంగారు తెలంగాణాగా ఎలా మార్చుకున్నామో చెప్పుచూ..
"త్రాగునీరు భగీరథ తరలి వచ్చె
కాకతీయ మిషనుతోలె కరువు బరువు
రైతు రాజగు పథకం రైతుబంధు
వెలుగు బంగారు తెలగాణ వేగుచుక్క
ఆణిముత్యంబు నా తెలంగాణ సీమ"-అని తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను పేర్కొన్నారు.
లక్ష్మణ మూర్తి గారు "కవి అనే వాడు ఎలా ఉండాలి ? కవిత్వం ఎలా ఉండాలి ? పద్యాన్ని ఎలా రాయాలి ? దాని గొప్పతనం ఏమిటి?" అనే విషయాలకు ఇందులో తనదైన రీతిలో సమాధానం ఇచ్చి నవ,యువ కవులకు మార్గదర్శనం చేశారు.
"కవితలు వ్రాయగావలయు కావ్యములెన్నో సృజించగావలెన్
భవితకు శాసనంబులయి భారత భూమి ప్రశస్తి కెక్కగా
కవితను వీడగావలదు కావ్య విచారణ చేయగా వలెన్
కవిత యటన్న కాకరయె కాదనుటెట్లు కవిత్వ సీమలో" - అని కవిత్వ గొప్పతనాన్ని చాటాడు.
దేశరక్షణ కొరకు కన్న వారిని, ఉన్న ఊరిని, భార్యా పిల్లలను వదిలి, ఎముకలు కొరికే చలిలో, ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ, ప్రాణాలను సైతం లెక్క చేయక శతృమూకలతో యుద్దం చేస్తూ దేశ సేవ చేస్తున్న సైనికుల త్యాగాలను..
"జననియు జన్మభూమియును స్వర్గము కన్నను మిన్నగా విధిన్
మనమున భక్తి నింపుకొని మంచు,ఏడారులు లెక్క సేయకన్
కనులను రెప్ప వేయకను కాచుచునుండి నిరంతరంబుగన్
తను ధన మాన ప్రాణములు ధారగ ఓసిరి సైనికోత్తముల్" - అని సైనికుల త్యాగాలకు అక్షరార్చన చేశారు.
తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ గురించి, అద్భుతమైన శిల్ప ఖండముగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి యొక్క శిల్ప కళా వైభవాన్ని, పూర్వం నుండి ఇప్పటివరకు చిన్న పిల్లలకు చెప్తున్న "రాజ కుమారులు-ఏడు చేపలు"-నీతి కథను పద్యాలలో ఈ కవి చెప్పడాన్ని చూస్తే,"కాదేదీ కవితకనర్హం"-అనే శ్రీ శ్రీ మాటలు గుర్తుకు వస్తాయి.
ఇలా అల్వాల లక్ష్మణ మూర్తి గారు వృత్తాలు, జాతులు, ఉపజాతులు మొదలైన రీతుల్లో రాసిన ఈ "సూర్యోదయం" అనే ఖండ కావ్యం వైవిధ్యభరితమైన అంశాలతో కూడి, ఆణిముత్యాల్లాంటి పద్యాలతో, సూర్యుని కిరణాలు విశ్వమంతటా ప్రసారించినట్లుగా, ఇందులోని పద్యాలు సకల మానవాళికి చైతన్య ప్రేరకాలుగా, ప్రబోధాత్మకంగా ఉండి, పండిత పామర జనరంజకంగా ఉన్నాయనుటలో ఎలాంటి సందేహము లేదు.
ప్రతులకు :
అల్వాల లక్ష్మణ మూర్తి
సుభాష్ నగర్, టీచర్స్ కాలనీ
ఇంటి.నెం.3-143/డి, కల్వకుర్తి(పోస్టు& మండలం)
నాగర్ కర్నూల్ (జిల్లా)-509324
చర వాణి.9550467431&9550017431.