సంస్కృతి ప్రతీకల పరిమళం "బంజార మొగ్గలు"

By SumaBala Bukka  |  First Published Jan 5, 2024, 4:20 PM IST

సైదులు ఖేతావత్ తన అధ్యయనం, పరిశోధన రంగరించి బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను  "బంజారా మొగ్గలు" లో పరిమళింప చేశారు. ఈ సంపుటి పైన కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :


చదువు సంస్కారాన్ని నేర్పుతుంది.  అంతేకాదు విజ్ఞతను, వివేకాన్ని రేకెత్తిస్తుంది. దళితులు, ఆదివాసీలు,బంజారాలు వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యావంతులవుతున్నారు.  ఇది సమాజ పురోగమనాన్ని లెక్కించే కొలమానం. చదువుకున్న బడుగు, బలహీన వర్గాల సృజనశీలురు తమ తమ మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కునేందుకు   ప్రయత్నించడం శుభ పరిణామం. ఆ క్రమంలో అధ్యాపకులు, కవి అయిన బంజార బిడ్డ సైదులు ఖేతావత్  తన అధ్యయనం, పరిశోధన రంగరించి బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను  "బంజారా మొగ్గలు" లో పరిమళింప చేశారు.

అడవుల్లో, కొండల్లో మొదలైన బంజారాల జీవితాలు మైదానాల వైపు ఎలా విస్తరించాయో, ఏవిధంగా సంస్కృతిని  కాపాడుకుంటున్నారో ఈ మొగ్గల్లో చాలా ఆసక్తికరంగా వర్ణించారు.  ప్రపంచీకరణ నేపథ్యంలో అందరి జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి.  కొన్ని తమ ఉనికిని కోల్పోయాయి. మరికొన్ని సమూహాలు తమ సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చాయి. కాని లంబాడీలు తమ ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది వారి విలువల పట్ల, సంప్రదాయాల పట్ల వారికి ఉన్న విశ్వాసం.

Latest Videos

undefined

కష్టించి జీవించే జీవన సరళికి, శరీర దారుఢ్యానికి బంజారాలు ప్రతీకలుగా నిలుస్తారు. ముఖ్యంగా స్త్రీలు నిసర్గ సౌందర్యానికి పట్టుగొమ్మలు.  వలస జీవనంతో మొదలైన బంజారాల జీవితాలు తెలంగాణలో స్థిర జీవనానికి అలవాటు పడుతుండడం వాంఛనీయ పరిణామం. చదువులు అబ్బినవి.  సంస్కారం అలవడినది.  ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సమాజంలో అంతర్భాగమై అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు. అయినా ఒక వైపు మార్పులను ఆహ్వానిస్తూనే తమ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకోవడం బంజారాల ప్రత్యేకత.

ఈ కవి గతంలో 'ఝాంప్డ' వంటి కవితా సంకలనంతో పాఠకులకు పరిచితుడే. ఇన్నాళ్ళకు బంజారా మొగ్గలు చిరు కవితా సంపుటితో మన ముందుకు వస్తున్నారు. వీరు వృత్తిరీత్యా డిగ్రీ కళాశాల అధ్యాపకులు. బాల్యం అంతా తాండాలో గడిపిన అనుభవాలు, పరిశీలనతో పెంచుకున్న ఆసక్తి ఈ కవితా సంకలనానికి ముడి సరుకులు.  బంజారాల జీవన శైలిని కవితాత్మకంగా అర్థం చేసుకోవడానికి ఈ కవితా సంపుటి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
          ' సంచార జీవనాన్ని వదలి
            శ్రమైక జీవనానికి సొగసద్దిరి
          లంబాడీలకు దారి దీపం లవణం'

అంటాడు కవి. వలస జీవన కాలంలో ఎద్దుల బండ్ల మీద బంజారాలు ఊరూరు తిరిగి ఉప్పు వ్యాపారం చేసేవారట. ఆనాటి ఆకలి జీవితాలను ఆదుకున్నది లవణ వ్యాపారమే. రాను రాను సంచార జీవనానికి స్వస్తి పలికినా బంజారాలు వారసత్వంగా వచ్చిన జీవన సౌందర్యాన్ని కోల్పోలేదంటాడు కవి.

సఖ్య భక్తికి ప్రతీక హథీరాం బావాజీ. వీరు బంజారాల ఇష్ట దైవం. కలియుగ దైవం వేంకటేశ్వరునితో చెలిమి నెరిపి తనతో పాచికలాడించిన హరి భక్తుడు. ఆ దృశ్యాన్ని కవి మన కళ్ళకు కడుతూ ఇలా....
'సఖ్య భక్తి చేత చెలిమి చేసి
ఏడు కొండల స్వామిచే పాచికలాడాడు
హరి మెచ్చిన భక్తాగ్రేసరుడు హథీరాం బావాజీ'-
అంటూ కుల దైవాన్ని అతని గొప్పతనాన్ని కీర్తించాడు.

బంజారాల ఆహార వ్యవహారాలను వారి ఆరోగ్య రహస్యాని వారి బుద్ధి కుశలతను ఇట్లా కవిత్వీకరిస్తాడు చూడండి.
" నవధాన్యాలను నంజుకుంటూనే
ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు   
బంజారాల బలవర్ధక ఆహారం చిరుధాన్యాలు".

ఇవాళ మనం ప్రయత్నంతో అలవర్చుకుంటున్న మిల్లెట్స్ ను గుర్తు చేస్తాడు.

"చెట్ల పైనున్న బుద్ధి ఆకులతో కలిపి
అటికలో చింత చిగురు చిందులేస్తుంది
బుద్ధి బలాన్ని పెంచే ఆకుకూర బుద్ధికూర".

అసలు ఒక ఆకుకూర పేరు బుద్ధి కూర అంటారన్న సంగతి లంబాడీలకు తెలిసినంత మన బుద్ధి జీవులకు తెలుసని నేను అనుకోను. అది తింటే మనిషి జీవితంలో బుద్ధి కుశలత ఎలా వికసిస్తుందో సైదులు అలతి అలతి పదాలతో కవిత్వీకరించడం విశేషం. బంజారాల ఆస్తి ప్రధానంగా పశుసంపద అందులో ప్రధానమైనవి ఆలమందలు. బంజారాలకు గోవుల మీద ఉండేది భక్తి మాత్రమే కాదు, వాటిని జీవనాధారంగా భావిస్తారు.  అందుకే గోవులను అపురూపంగా చూస్తే సంపదను సృష్టించి మేలుచేకూరుస్తాయి.  లంబాడాల ఆస్తిపాస్తులు ఆలమందలు!

ఇంకా వారి పెళ్లి , పేరంటాలను గూర్చి ఒక వింతైన ఆచారాన్ని ప్రస్తావిస్తారు సైదులు. బహుశా ఈ ఆచార వ్యవహారం గిరిజనేతరులకు తెలియదంటాను నేను.
'చూడండి పెళ్లికి ముందే మూడు నెలలు ముచ్చటగా అత్తగారింట్లో పెళ్ళికొడుకు తిష్ట వేస్తారు వ్యక్తిత్వం గుణగణాలు గుర్తించే సమయం'
ఆధునికులు ఆచరిస్తున్న డేటింగ్ విధానానికంటే ఎంతో ప్రయోజనకరమైనది.   హానికరం కానిది ఇది.  తొంబై రోజుల కాలం అత్తగారింట్లోనే ఉంటూ వధువు వ్యక్తిత్వమే కాదు కుటుంబ జీవన విధానం కూడా అర్థం చేసుకునే అవకాశం.  అంటే ఒక కుటుంబ సభ్యునిగా ఇమిడిపోవడమే. కుదరనప్పుడు మరో సంబంధాన్ని ఎంచుకునే వీలుంది.

ఇంకా లంబాడీల వేష , భాష విషయాలు ఎంతో విభిన్నమైనవి.
"టుక్రి ఫెట్య కాళి బల్య భూర్యవేసుకుంటేనే
అందమంతా అందులోనే ఒదుగుతుంది!
అద్దాల రవికలు రూపానికి సొమ్ములు!"

ఈ కవితా పంక్తులు బంజారాల నిసర్గ సౌందర్యానికి అద్దంపడతాయి. లంబాడాల మూల చరిత్రను వివరిస్తూ -
'లంబాడీల పుట్టుక గురించి తరచి చూస్తే
వాలి సుగ్రీవులు మూలపురుషులని తెలుస్తున్నది
సంచార జీవితాలు గుడారాల బతుకులు'
అంటూ వారి జీవన చిత్రాన్ని కళ్ళకు గడతాడు.  ప్రపంచీకరణ దుష్ప్రభావం తాండాలమీద కూడా పడిందంటూ ఆ విషయాన్ని ఎంతో వేదనతో ఇలా వర్ణిస్తాడు.

"ప్రపంచీకరణ ఉరికొయ్యకు
తండాలన్నీ వేలాడుతున్నాయి
మార్పుకై మరణంతో పోరాడుతున్నాయి"

ఇట్లా అన్ని కోణాల్లో బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూనే మధ్య మధ్యలో అనేక ఇతర   కవితా వస్తువులను కూడా ఈ సంపుటిలో స్పృశించారు. కొత్తగా కవిత్వం మొదలుపెట్టిన వారికి మొగ్గలు కవితా ప్రక్రియ సుళువైన మార్గం. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియ మరింత ముందుకు  సాగుతుందని భావిద్దాం. జాతిపరమైన కవితా మొగ్గలు గతంలో ఎన్ని వచ్చినప్పటికీ ఈ బంజారా మొగ్గలు ఒక ప్రత్యేకమైన వని చెప్పవచ్చు.
 

click me!