జనాలను థియేటర్లకు రప్పించేందుకు మాత్రమే ముద్దుని ఓ ఎరగా వాడుతున్నారు. మా సినిమాల్లో లెక్కు మించి ముద్దులు ఉన్నాయహో.. అంటూ ట్రైలర్స్, టీజర్లలోనే చెప్పేస్తున్నారు.
‘‘ముద్దు’’ అనేది ఓ తీయని అనుభూతి. ప్రేమకు ప్రతిరూపంగా ముద్దును ఉపయోగిస్తారు. ముద్దులో రకాలు కూడా ఉంటాయి. ముద్దులన్నింటినీ శృంగారంతో ముడిపెట్టలేం. ఎందుకంటే.. తల్లి బిడ్డలు, అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ములు, తండ్రి కూతుళ్లు, భార్య భర్తలు.. ఇలా ప్రతి బంధంలోనూ ఏదో ఒక సమయంలో తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ముద్దు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ ముద్దుల గోలేంటి మాకు అనుకుంటున్నారా..? ఏంలేదండి.. ఈ రోజు ఇంటర్నేషనల్ కిస్ డే. అందుకే ఈ కథంతా..
ఈ సందర్భంగా ఇండియన్ సినిమాల్లో ముద్దులో వచ్చిన మార్పులను ఒకసారి పరిశీలిద్దామా.. ఇండియన్ సినిమా ముఖ్యంగా బాలీవుడ్. ఎందుకంటే.. మన ఇండియన్ సినిమాల్లో కాస్త ఘాడత ఎక్కువ ఉండేది అక్కడే కాబట్టి. సినిమాలు జనాల దగ్గరకు వచ్చిన కొత్తలో ఎలా ఉండేది.. ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి చూస్తే..
ప్రస్తుతం విడుదలౌతున్న సినిమాల్లో.. అవసరం ఉన్నా లేకున్నా.. కేవలం జనాలను థియేటర్లకు రప్పించేందుకు మాత్రమే ముద్దుని ఓ ఎరగా వాడుతున్నారు. మా సినిమాల్లో లెక్కు మించి ముద్దులు ఉన్నాయహో.. అంటూ ట్రైలర్స్, టీజర్లలోనే చెప్పేస్తున్నారు. వీటిలో కొన్నింటిని ప్రేక్షకులు ఆస్వాదిస్తుండగా.. మరికొన్ని మాత్రం కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాయి.
అసలు ఇండియన్ సినిమాల్లో ముద్దు సన్నివేశాలను 1920వ సంతవ్సరంలోనే పరిచయం చేశారు. బాలీవుడ్ లో తొలి ఆన్ స్క్రీన్ కిస్ ‘ పతి భక్తి’ అనే సినిమాలో చూపించారు. లలితా పవార్ ఇందులో కీలక పాత్ర పోషించారు. దీని తర్వాత ‘ ఏ త్రో ఆఫ్ డైస్’ అనే సినిమాల్లో ఎక్కువ నిడివితో ముద్దు సన్నివేశాన్ని రూపొందించారు. దీన్ని చూసి చాలామంది సినిమాటోగ్రాఫర్లు కూడా షాకయ్యారు. ఈ సినిమాలో సీతాదేవి, చారు రాయ్ లు ప్రధాన పాత్రలు పోషించగా.. వీరిద్దరే ఆ ముద్దు సన్నివేశానికి ప్రాణం పోశారు.
1930లలో జుబేదా అనే నటి..జరీనా అనే సినిమాలో ఎక్కువ సార్లు కిస్ సీన్ లలో నటించేరు. ఆ తర్వాత మరో నటి దేవికా రాణి.. కర్మ అనే సినిమాలో తన నిజజీవిత భర్త హిమాన్షు కి లిప్ లాక్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. 1950, 60ల కాలంలో.. హీరో, హీరోయిన్ల మధ్య ముద్దు సన్నివేశాలు పెట్టడం ప్రారంభించారు. కాకపోతే.. ఆ జంట మధ్య ప్రేమ బంధాన్ని తెలియజేయడానికి.. వారు ముద్దుపెట్టుకున్నట్లుగా క్రియేట్ చేసేవారు. వారిని బ్లర్ చేయడం లేదా.. వారి మధ్య పువ్వులాంటివి పెట్టి వాటిని షేక్ చేయడం లాంటి సన్నివేశాలు పెట్టి లేని ముద్దుని ఉన్నట్లుగా క్రియేట్ చేసేవారు.
1970ల్లో బాలీవుడ్ సినిమాకి బోల్డ్ నెస్ యాడ్ అయ్యింది. రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బాబీ సినిమాలో తొలిసారిగా బోల్డ్ నెస్ ని యాడ్ చేశారు. దీనిలో డింపుల్ కపాడియా, రిషి కపూర్ లు తొలిసారిగా ఆన్ స్క్రీన్ పై ముద్దుని పరిచయం చేశారు. ఇదే డైరెక్టర్ ‘ సత్యం, శివం, సుందరం’ సినిమాలో మళ్లీ కిస్ సీన్ ని రిపీట్ చేశారు. అక్కడి నుంచి మొదలు బాలీవుడ్ నటీనటులు అందరూ.. ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు ధైర్యం చేశారు.
ఆ తర్వాత 1980లలో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ ‘ రామ్ తేరి గంగా మైలి’ లో కూడా ముద్దు సీన్ లు జోడించారు. దీంతో.. ప్రతి ప్రేమకథలో ముద్దు సీన్లు కామన్ గా మారిపోయాయి. 1990ల్లో బాలీవుడ్ డ్యాన్సింగ్ దివా.. మాధురీ దక్షిత్, అమీర్ ఖాన్ జంటగా నటించిన ‘దిల్’ సినిమాలోనూ ముద్దుల పరంపర కొనసాగించారు. దీంట్లో మాధురి ముద్దు సన్నివేశాల్లో నటించడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఆ షాక్ నుంచి వారు తేరుకోకముందే.. దయావాన్ సినిమాలో వినోద్ కన్నాకి లిప్ లాక్ ఇచ్చి మరో షాక్ ఇచ్చింది.
‘ రాజా హిందూస్థాని’లో అమీర్ ఖాన్, కరీష్మా కపూర్ లు, ‘ జో జీతావోహి సికిందర్’ లో అమీర్ ఖాన్, పూజాబేడీలు, ‘1942 ఏ లవ్ స్టోరీ’ లో అనీల్ కపూర్, మనీషా కోయిరాలాలు.. ముద్దుపై ఉన్న హద్దులను పూర్తిగా పోగొట్టేశారు. ఇక 2003లో ఓ సినిమాలో మల్లికాశరావత్ ఏకంగా 17 ముద్దు సన్నివేశాల్లో నటించారు. ఇది అప్పట్లో ఫుల్ సెన్సేషనల్ అయ్యింది. దీని తర్వాత ఇమ్రాష్ హష్మీ, మల్లికాశరావత్ లు నటించిన మర్డర్ సినిమాలోనూ పదుల సంఖ్యలో ముద్దు సీన్స్ తెరకెక్కించారు. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మీ ప్రతి సినిమాలో లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి. సీరియల్ కిస్సర్ బిరుదుని కూడా ఆయనకి దక్కింది.
ఇక ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధూమ్ 2లో ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ లు.. త్రి ఇడియట్స్ లో కరీనాకపూర్, అమీర్ ఖాన్ లు.. జబ్ థక్ హై జాన్ లో కత్రినా కైఫ్, హృతిక్ రోషన్లు ఘాటుగా ముద్దు సీన్లలో నటించారు. అంతెందుకు బ్లాక్ సినిమాలో అమితాబ్, రాణి ముఖర్జీల మధ్య కూడా ఓ ముద్దు సీన్ ఉంది.
ఇక 2010లలో ముద్దు సీన్లను ఓ జిమ్మిక్ లాగా వాడుకున్నారు. కేవలం సినిమా పాపులారిటీ కోసం ఇలాంటి సీన్లు పెట్టడం దర్శక నిర్మాతలు అలవాటుగా మార్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతున్న తారలు దీపికా, రణబీర్, అలియా భట్, అర్జున్ కపూర్ , శ్రద్ధాకపూర్, వరుణ్ దావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఇలా అందరూ తమ ప్రతిసినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందరూ మోడ్రన్ యుగంలో దూసుకుపోతున్నారనే సాకుతో సినిమాల్లోకి కృతికంగా శృంగారాన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తొలి నాళ్లలో ముద్దు సన్నివేశాల్లో ప్రేమ మాత్రమే కనిపించేది. ఇప్పుడు ముద్దుకి అర్థం మార్చేసి సినిమాల్లో చూపిస్తున్నారు.